పుట:Varavikrayamu -1921.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము

79


పుంజలు తెంపి పుచ్చుకొనుచున్నారు! మన కీయవలసి వచ్చినప్పుడు "మా కానవాయిత లే" దనుచుఁన్నారు. మన మిచ్చిన కట్నమునుబట్టి మంగళ హారతిలో మన కైదు నూటపదాఱులు రావలెను గదా? వారు వరహాకంటె వేయరట!

పురు :- ఈ మాట చెప్పుటకేనా నీ విపుడు వచ్చినది?

భ్రమ :- ఇది కాదు. ఈపూట వియ్యపురాలి పినతల్లి కూతురు తోడికోడలి యక్క యాఁడబిడ్డ సవతి మొగమున నద్దిన మొహిరీ మోటుగా నున్నదఁట. అందులకై యామె యలిగినదఁట. వియ్యపురాలు విచారించుచుఁ గూర్చున్నదఁట. అమ్మలక్క లందఱుఁ జుట్టునుమూఁగి యామెకుఁ బురెక్కించుచున్నారఁట.

పురు :- సరే వెళ్ళికాళ్లమీదఁబడి కటాక్షింపుమని వేడుదము పద! పేరయ్యగారూ! నేను వచ్చువరకును మీరిచ్చట నుండుఁడు. (అని భార్యతోఁ బరిక్రమించి, ఆకసమువంకఁ జేతులు జోడించి)

గీ. ఆఁడుబిడ్డ పెండ్లి అతి లోభితోఁడఁ జు
   ట్టఱిక మెముకలెల్ల గొరుకు లౌక్య
   జాతి కింట విందు సర్వేశ్వరా? పగ
   వారికి న్విధింప వలదు, వలదు.

(తెరపడును.)

ఇది సప్తమాంకము.


★ ★ ★