Jump to content

పుట:Varavikrayamu -1921.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

వరవిక్రయము


పీట వేశారట. అందుకోసం భీష్మించి కూర్చున్నాడు. వియ్యపురాలిగారి అన్న పిన్నత్తగారి ఆడపడుచు తోడికోడలు సవతితల్లి తమ్ముడు మేనమామగారి మేనత్త కొడుకు మేష్టరుగారితో వచ్చిన స్నేహితుఁడు గారఁట. ఆయన్ను రాత్రి మీ రందరితోపాటాదరించ లేదట, అందుకోసం రైలుకు పోతానని రంకెలు వేస్తున్నాడు. స్టూడెంట్లకు రాత్రి బంగాళాదుంపల కూరా, పకోడీల పులుసూ చేయించారు కారట, అందుకోసం వారీపూట వెళ్ళడం మానివేదామా అని ఆలోచిస్తున్నారు. వారంతా రానిది మే మెలా వస్తామని కడంవాళ్ళు కాళ్ళు చాచుకొని కూర్చున్నారు. ఇక తమరు వెళ్ళి తంటాలు పడవలసినదే కాని నావల్లకాదు.

పురు :- ఊరివారు?

పేర :- వూరివారు మామూలు పాటే "యిదుగో వస్తున్నాము పదండి."

పురు :- రామమూర్తిగారు రాలేదేమీ?

పేర :- పట్టుబట్ట మరచెంబూ తేవడానికి బ్రాహ్మడు దొరకలేదట, బ్రాహ్మణ్ణి వెతికించడానికి కూలిమనిషి కోసం బయల్దేరారు.

పురు :- చైనులుగారో?

పేర :- నిన్న తలవెంట్రుకలున్న పూర్వసువాసినీ ఎవరో వంటశాల వైపునకు వచ్చినదంట, పాప మందుకోసం ప్రాయశ్చిత్తం చేయించుకుంటున్నారు. ఈ పూట శాక పాకాలేమిటని అడిగితే, పనసకాయ కూరా, పులిహోరా, బొబ్బట్లు, బూంది మిఠాయి అని చెప్పినాను. అయితే, ఐదునిముషాలలో వస్తాను పద మన్నారు.

పురు :- అచ్యుతరామయ్యగారో?

పేర :- ఈ మధ్య బ్రహ్మసమాజిగా డెవరో పై అధికారిగా వస్తే ఆయనకోసం యజ్ఞోపవీతాలు తీసిపారవేశారట. నిన్న చొక్కాతో వస్తే నలుగురూ నవ్వారట. సాయంకాలానికి జంధ్యము సంపాయించుకొని వస్తానన్నారు.

భ్రమ :- (కోపముతో ప్రవేశించి) పేరయ్యగారూ! ఏరి ఏరి చివర కెంతచక్కని సంబంధము సంపాదించినారండి! వారి లాంచనములు వారు