షష్ఠాంకము
69
యెవరు చెప్పగలరు! కావున, దాని యభిప్రాయము తెలుసుకొని దాని యిష్టమెట్లో యట్లే జరిగింపుడు.
పేర :- అదీ బాగానే వుంది. అమ్మాయీ! నీ యభిప్రాయమేమిటో చెప్పమ్మా! నీకా చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా? లేక అయిదువేలా అయిదు వందల పది రూపాయలూ - ఆబ్రాహ్మడికి అర్పితముచేసి వూరుకోమంటావా!
కమ :- (తనలో) ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? అక్క సిద్ధాంతమునే యనుసరింపఁదగునా? అందులకు భిన్నము గావించి తలిదండ్రులకుఁ దాత్కాలిక మనశ్శాంతిని గలిగింపఁదగునా! అక్క చెప్పిన వాక్యములన్నియు నాణెముత్తెము కోవలు. కట్నాలరాయలచేఁ గళ్యాణసూత్రము గట్టించుకొనుటకంటె గతిమాలినపని మఱిలేదనుట నిశ్చయము. అట్టి వివాహము నాకును నంగీకారము లేదన్నచోఁ, దలిదండ్రులు నన్నుఁ బలవంతపెట్టరనుటయు నిశ్చయమే. కాని, దానివల్లఁదేలు పర్యవసాన మేమి? అయిదువేల యైదువందలు నా దుర్మార్గుని పొట్టను బెట్టించుట తప్ప మరేమియు లేదు. అందువల్లఁ నా దారి విడిచిపెట్టి యా సంబంధమునే యంగీకరించి, పణమునకుం దగిన ప్రాయశ్చిత్తము చేయఁగలిగినచో వీరిచ్చిన ద్రవ్యము వినియోగములోనికిఁ దెచ్చినదాన నగుటయేగాక అక్క కసితీర్పఁగలిగినదాననై ప్రపంచమున కొక పాఠము నేర్పినదానను గూడ నగుదును. అయితే అట్టి ప్రతీకార మే విధముగాఁ జేయగలుదును. (ఆలోచించి) సరే కానిమ్ము.
గీ. కట్టె మథియింప యింపఁ గలుగు నిప్పు;
భూమి త్రవ్వంగఁ ద్రవ్వంగఁ పుట్టు నీరు;
పెరుగుఁ తరువంగఁ దరువంగఁ పేర్చు వెన్న;
కన్పడదె దారి యోజింపఁ గార్యములకు?
పురు :- అమ్మాయి! ఆయన యడిగిన మాటకు బదులుచెప్పవేమి! సందేహ మక్కరలేదు. నీ యభిప్రాయమేమో స్పష్టముగా జెప్పు. నిన్ను మే మించుకయు నిర్బంధించువారము కాము.
కమ :- (తల వంచుకొని) మీ యిష్టము.