Jump to content

పుట:Varavikrayamu -1921.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము

65


వేలూ దక్కి యీపాటి కింకో అయిదువేలకు బేరం తగిలేది.

లింగ :- అదిగో అదే నాకు పట్టుకొన్న బాధ! చావునకేమి యెప్పుడైనఁ జావవలసినదే. రవంత సందర్భానుసారముగఁ జచ్చినబాగుండెడిది? సరికాని యీ సొమ్ము మాట యేమయిన వచ్చినదా?

పేర :- ఎందుకురాదూ? ఆ సొమ్ముకోసమే నేనిపుడు వచ్చింది.

లింగ :- అలాగుననా? అయితే, ఆసొమ్మంత మీద మీఁదనున్నదా? నే నెంత ప్రయత్నము చేసినానో ఎంతైనదో ఎరుగుదువా?

పేర :- ఆ నష్టం మినహాయించుకుని మిగత సొమ్మే యివ్వండి!

లింగ :- ఇవ్వని యెడల?

పేర :- దావా చేస్తాడు.

లింగ :- సాక్ష్యము?

పేర :- మీ రసీదులే!

లింగ :- పేరయ్యా! నేనంత పెయ్యమ్మనా? నా దస్తూరివలె వ్రాయలేదు నా సంతకము వలె చేయలేదు. నన్నా రసీదు లేమి చేయును?

పేర :- (తనలో) ఆరి ముండాకొడకా! అయిదువేలూ మ్రింగి వెయ్యాలనేనా కావోసు! (పయికి) అంత పనొస్తే మేమందరం లేమూ?

లింగ :- అందఱ మాటయు నావల చూతముగాని ముందు నీమాట చెప్పు. నీ యైదువందలు మరల క్రక్కుట నీ కిష్టమేనా?

పేర :- కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కక ఏం చేస్తాం?

లింగ :- ఇదిగో యిదే వైదికము! ఈమాట నియోగియైన వాఁడనునా?

పేర :- అదుగో ఆమాటలు మాత్రం నేనంగీకరించను. మావాళ్ళిప్పుడు మీవాళ్ళ నమాంతముగా మ్రింగేసే వాళ్ళయినారు. మీవాళ్లుమీసాలమీద నిమ్మకాయలు నిలబెడితే, మా వాళ్ళు మామిడికాయలు నిలవబెడుతున్నారు! మీవాళ్ళు జుట్టుమానేస్తే మావాళ్ళు బొట్టుకూడా మానేశారు? మీవాళ్ళు మూరెడు గోచీ పెడితే మావాళ్ళు బారెడు గోచీ పెడుతున్నారు? మీవాళ్ళు వ్రేలెడు చుట్టకాలిస్తే మావాళ్ళు జానెడుచుట్ట కాలుస్తున్నారు?