షష్ఠాంకము
63
వెళ్ళితే అమ్మగార్ని కొరుక్కుతినేస్తానా? (అని నిష్క్రమించును.)
లింగ :- పెంకికుంక! పెడేలున నెంతమా టన్నాఁడో! అయినను, వానిననవలసిన పనిలేదు! ఈడు కడచిన వెనుకఁ బెండ్లి యాడిన బుద్ధిహీనుల కిట్టి చెప్పుదెబ్బలు తఱచుగా తగులుచునే యుండును!
సీ. ప్రాయఁ ముడిగి యేండ్లు -పైఁబడ్డ తరి భ్రాంతిఁ
జెంది రెండవ పెండ్లి చేసికొనుట
ఆస్తి దాయాదుల కగు నను చింతచేఁ
బెరవారి బిడ్డను బెంచుకొనుట
క్రొత్తలోఁ జూపు మక్కువ లెల్ల మది నమ్మి
అత్తవారింటను హత్తుకొనుట
అప్పుల వారిని దప్పించుకొన సొత్తు
లితరుల పేర వ్రాయించి యిడుట
పుడమి, నీనాలుగుం జాల బుద్ధిమాలి
నట్టి పనులని పల్కుదు రార్యులెల్ల
రందు మూడవ పెండిలి యాడినట్టి
బడుగు నగు నన్నుఁ గూఱిచి పలుకనేల?
బస :- (పత్రిక చేతఁబట్టుకొని ప్రవేశించి) నాన్నా! ఆ సంగతి పత్రికలో గూడ పడినది సుమా!
లింగ :- ఏ సంగతి?
బస :- ఆ పిల్ల బావిలో పడి చచ్చిన సంగతి. నా క్లాసు పిల్లలందరు నిది చదివి, నన్నుఁ గాకులవలెఁ బొడుచుకొని తినుచున్నారు! పాడు కట్నము కొఱకు నీ వెందుల కంత ప్రాకులాడవలెను నాన్నా?
లింగ :- ఓరి దామోదరుఁడా! సర్వము విడిచిపెట్టిన గాంధికి స్వరాజ్యము కొఱకంత ప్రాకులాట యెందులకురా?
బస :- ఆయన ప్రాకులాట యంతయు నాయన కొఱకా?
లింగ :- నా ప్రాకులాట మాత్రము నాకొరకా? నీ తెలివి తెల్లవారినట్లే యున్నది. కాని ఏది యేమి యేడ్చినాఁడో చదువు!
బస :- (చదువును)