Jump to content

పుట:Varavikrayamu -1921.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

వరవిక్రయము

    ఇక రవంత లోపమే నిక్కముగఁ గాన
    వచ్చెనేని బ్రతుక నిచ్చు నమ్మ.

కాళిం :- అయ్యయ్యో? మీరుగూఁడ నట్లనెదరేమి? నా కింగ్లీషు చెప్పిన దొరసానికి నలుబదియారేండ్లున్నవి. ఇప్పటికిఁ బెండ్లి లేదు. ఆమె యేమి అపనిందలపాలైనది?

భ్రమ :- సరే యిఁక నేమీ! చక్కని యుపమానమే దొరకినది. ఆమెకును మనకును గల యంతరమేమో తెలియునా? మన దేశములో, నాఁడుది యాడుదే, మగవాఁడు మగవాఁడే. అక్కడనో ఆఁడుది మగవాఁడు, మగవాఁ డాడుది. తెలిసినదా? ఈ మంకుతన మిఁకఁ జాలునుగాని, ఈపాటికి లోపలికి బోవుదము రమ్ము. (అని బలవంతముగాఁ కాళిందిని దీసికొని పోవును.)

పురు :- పేరయ్యగారూ, విన్నారా సంగతి?

పేర :- విన్నాను బాబూ, విన్నాను. ఏమిటో యెరిగి ఎరగని పిల్లల కేం తెలుస్తాయి కష్టసుఖాలు.

పురు :- ఇప్పుడేమని మీ సలహా?

పేర :- తమకు నేను సలహా చెప్పాలా. అయినా దీనికంత సలహాతో పనేముంది? కట్నం సొమ్ము పంపివేసినట్లు తెలిస్తే, కార్యం లేదని ఆ చిన్నదే వూరుకుంటుంది. ఆ కాస్త ముడి పడిందా పెనిమిటి బెల్లమే అవుతాడు.

పురు : -అట్లయిన నిఁక నాలస్య మెందులకు? ఇదిగో సొమ్ము ఇచ్చి చక్కరండు. (అని నోట్లు లెక్క పెట్టి) బజానాక్రింద నిచ్చిన పదిరూపాయలు మినహాయింతమా?

పేర :- ఆ బ్రాహ్మణుడు నోట్లకు మారకం అడక్కుండా విడిచిపెడతాడా? ఆ పదిరూపాయలూ అందుక్రింద సరిపుచ్చుతాను.

పురు :- అట్లే కానిండు. (అని నోట్లిచ్చి) మీరొకసారి చూడుడు.

పేర :- (లెక్కచూచి) ఐదు వేలా ఐదువందలు సరిగా వున్నాయి. ఈదారినే వెళ్ళి యిచ్చివేసి, ముట్టినట్టు ముక్కకూడా వ్రాయించుకు వస్తాను. శలవు. (అని కొంచ మావలికి వచ్చి) బ్రతుకుజీవుడా, బ్రాహ్మడు పప్పులో అడుగువేస్తాడేమో అని ప్రాణాలు కొట్టుకొన్నాయి. లేచిన వేళ మంచిది.