పుట:Varavikrayamu -1921.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

వరవిక్రయము


ముండాకొడుకు చేతుల్లో ఐదురూపాయల నోటూ పెట్టగానే, అదివరకు వచ్చిన వారినందరిని వెనకబెట్టి అరగంటలో తేల్చేశాడు.

పురు : -పెండ్లికొడుకు ముడుపు పేరయ్యగారిచేత బంపివేయమనెదవా? అదేమి నీ వట్లున్నావు?

భ్రమ :- కాళింది నాకీ పెండ్లి వలదని కావలసినంత గందరగోళము చేయుచున్నది! ఏమి చెప్పినను దాని తల కెక్కుటలేదు!

పురు :- అదేమీ?

భ్రమ :- కట్న మిచ్చి వరునిఁ దెచ్చుకొనుట గౌరవహీనమని. ఆనవాయత లట్టెపోవునా? మీ పోలికలు పుణికి పుచ్చుకున్నందులకు మీ తిక్కయే దానికిని బట్టుకొన్నది!

పురు :- నా తిక్క నా బిడ్డలకుఁ గూడ నంటుకొనుట నాకానందమే కాని భగవంతుడు ప్రతికూలుడైనందున మా తిక్కతీరుమార్గముమాత్రమే లేకపోయినది! ఏదీ యెక్కడనున్న దొకసారి యిటు పిలువు.

కాళిం :- (తలవంచుకుని ప్రవేశించి) ఇదిగో యిక్కడనే యున్నానండి!

పురు :- (దగ్గరకు దీసికొని, తలనిమురుచు) అమ్మా! మీయమ్మతో నేమో యన్నావా టేమిటి!

కాళిం :- అమ్మతో నన్నమాట మీతోగూడ ననుటకే వచ్చినాను. నాన్నగారు? నాయెడ మీకు నిజముగా ప్రేమయున్నదా?

పురు : -అమ్మా! నీ కట్టి సందేహమేల గలిగినది?

కాళిం :- ఉన్న యెడల -

ఆ. కూతురనుచు బరుల చేతిలోబెట్టక
    కొడుగటంచు నన్ను గొంపలోనె
    యుంచుకొనుడు, మీరు పెంచలేకున్న గ
    ష్టించి మిమ్ము నేనే - పెంచుదాన.

పురు :- (గడ్డము పుడుకుచు) వెర్రితల్లీ! బిడ్డను బెరవారికిచ్చుట ప్రేమలేక కాదు, మరేమందువా!