పుట:Varavikrayamu -1921.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

రెండవ రంగము

ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.)

(ప్రవేశము: భ్రమరాంబ, కాళింది.)

భ్రమ :- అమ్మాయీ! యీ పూఁట నీ వన్నమునకు రాలేదేమి?

కాళిం :- ఆఁకలి లేదమ్మా!

భ్రమ :- అదేమే ! యే పూఁట కాఁపూఁట యాకలి లేదని మొదలు పెట్టినావు. పెండ్లి తలపెట్టఁగానే పెండ్లికూతుల కెక్కడలేని కళ వచ్చును. నీవేమిట్లు నీళ్ళు కారుచున్నావు?

కాళి :- అమ్మా! అడిగితివి కనుకఁ జెప్పుచున్నాను. ఈ పెండ్లి నా కిష్టము లేదే!

భ్రమ :- అదేమీ? ఆ పెండ్లి కొడుకు నచ్చలేదా యేమిటి?

కాళి :- పెండ్లికొడుకు కాదు. పెండ్లియే నచ్చలేదు.

ఆ. మీకుఁ గులము లేద మాకు రూపము లేద?
    యింత దైన్యమునకు -హేతువేమి?
    కట్నమిచ్చి వరుని గడియించుకొనుకంటెఁ
    జిన్నతనము వేఱె మున్న దమ్మ?

భ్రమ :- ఇంతియే కద. ఈ దురవస్థ యిపుడు మనకే పట్టినదా?

ఉ. కొంచెముపాటి వారలును గొంపను గోడులు నమ్మియేనియున్‌
    సంచులు చంకఁబెట్టుకొని సంతకుఁ బోయినట్లుఁ పోయి శో
    ధించి బిగించి తండ్రులు విధించిన విత్తము ముందె చేతిలో
    నుంచియ కాదె తెచ్చుకొను చుండిరి కూఁతుల కిప్డు భర్తలన్‌.