పుట:Varavikrayamu -1921.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

వరవిక్రయము

పురు :- ఏమే స్నానమునకు లేవవచ్చునా?

భ్రమ :- లేవవచ్చునుగాని యీ పది ఎకరముల భూమియుఁబోయినచో నిఁక మన బ్రతుకు తెరవేమిటి?

పురు :- వెఱ్రిదానా! యెంత మాటాడితివే!

సీ. కూలి నాలియు లేక కుడువ తోవయు లేక
          మలమల పస్తులు మాడువారు
   ఇల్లు వాకిలి లేక యిల్లాలు లేక, యే
          చెట్టు నీడనొ నివసించువారు
   పయిని పాతయు లేక, పండఁ జాపయు లేక
          వడవడఁ జలిలోన -వడకువారు
   కాళ్ళుఁ గన్నులు లేక, కదల మెదల లేక
          దేవుఁడా! యనుచు వా-పోవువారు

   కలరు మనదేశమునఁ గోట్లకొలఁది నేఁడు
   వారి నెల్లర నెపుడుఁ గన్నాఱఁ గనుచు
   బందలంబోలె మనమికఁ బ్రతుకు టెట్టు
   లనుచుఁ జింతింపవచ్చునే యజ్ఞురాల!

భ్రమ :- నిజమే! నిజమే!

సీ. ఱాతిలోఁ గప్పను రక్షింపఁ గలతండ్రి
        బొరియలోఁ జీమను బ్రోచు తండ్రి
   గంగలోఁజేఁపను గాపాడఁ గలతండ్రి
        మంటిలో నెఱ్ఱను మనుచు తండ్రి
   పుట్టలోఁజెదలను బోషింపఁగల తండ్రి
        కలుగులో నెలుకను గాంచుతండ్రి
   నాభిలోఁ ద్రిముల కన్నము పెట్టఁగల తండ్రి
        పేడలోఁ బురుగును బెంచుతండ్రి

   భూజములకెల్ల నీరము పోయు తండ్రి
   శిశువుతో స్తన్యముం దయసేయు తండ్రి
   దయయె స్వస్వరూపంబుగాఁ దనరు తండ్రి
   మనలఁ బోషింపఁడే వెర్రిమాటగాక!

(తెర పడును.)