పుట:Varavikrayamu -1921.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

47

భ్రమ :- మనకు గావలసిన దెంత?

పురు :- అయిదువేల యైదువందలు కట్నము గదా? ఆమీఁద వానికొక యైదువందలైనఁ గావలయును గదా? ఎటు జూచినా మొత్త మేడువేలైన లేకున్నఁ కార్యము జరిగి గట్టున బడలేము.

భ్రమ :- అందులకేమి యాలోచించినారు?

పురు : -అయినమట్టున కమ్మివేయుటకు నిశ్చయించుకొన్నాను. కాని యది మాత్ర మంత పయిపయి నున్నదా? అమ్మబోయిన నడవి, కొనబోయిన కొఱవి యన్నట్లు యేడువేల యైదువందలకన్న నెఱ్ఱని యేఁగాని పెట్టువా రగపడలేదు. పాపము పేరయ్యగా రీవిషయమునఁ బడుచున్న పాట్లకు మేరలేదు.

భ్రమ :- అరుగో మాటలోనే యాయనయు వచ్చినారు.

పేర :- (వగర్చుచు బ్రవేశించి) బాబూ, తమవద్ద శలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళేసరికి అదృష్టవశాత్తూ మా అల్లుడీపూట రైలులో వూడిపడ్డాడు. సందర్భవశాత్తూ ఇతనితో సంగతంతా చెప్పవలసి వచ్చినది. అతగాడు విని విని "మాఁవా; అటువంటి గృహస్థుల కీలాటి సమయములో అడ్డుపడడం కంటె కావలసిన దేమిటి? ఇంకో ఐదువందలు వేసి ఆ పొలం నా పేర వ్రాయించం" డన్నాడు. ఆపాటున బ్రతుకుజీవుడా అని ప్రాశన కూడా చెయ్యకుండా పరుగెత్తుకు చక్కావచ్చాను. ఏమి శలవు?

పురు :- సెలవున కేమున్నది? చెడి యమ్ముకొన్నను బది యెకరములకుఁ బదివేలయిన రాకపోదనుకొన్నాను. ఎక్కడను చిక్కనప్పుడేమి చేయగలము? పోనిండు, అన్యులకుఁ బోవుటకంటె, మీ యల్లున కగుట నాకధిక సమ్మతము. దస్తావేజు వ్రాయుంపుఁడు.

పేర :- దస్తావేజు వ్రాయించడమే కాదు, తక్షణం రిజిష్టరీ కూడా కావాలి. యేమో అతగాడికి మళ్ళీ యేం బుద్ధి పుట్టునో ఎవరు చెప్పగలరు? క్షణములో దేవతార్చన చేసుకొని చక్కా వస్తాను. తమరుకూడా భోజనము చేసి, దానికి సంబంధించిన కాగితాలన్నీ తీసి వుంచండి. శలవు. (అని పోవుచుఁ దనలో) అదృష్టముగా యిదీ అధమం రెండువేలైనా లాభిస్తాయి. ప్రస్తుతం అల్లుడు పేర వ్రాయించి, పదిరోజులు పోయాక ఫిరాయించుకుంటాను. [నిష్క్రమించును]