పుట:Varavikrayamu -1921.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

వరవిక్రయము

పురు :- ఎక్కడికని చెప్పుదును. ఊరంతయుఁ దిరిగి వచ్చినాను.

భ్రమ :- అంత త్రిప్పుట కిప్పు డవసర మేమి వచ్చినది? కమల సంగతి ప్రస్తుతం కట్టిపెట్టఁ దలంచితిమిగా!

పురు :- అందులకుఁ గాదే, అప్పుకొఱకు. కట్నము సొమ్ము, ముందు పంపినగాని కార్యసన్నాహ మారంభింపమని లింగరాజుగారు వర్తమాన మంపినారు. అందుచేత బదులుకొఱకు బయలుదేరినాను.

భ్రమ :- యెక్కడనూ జూడలే దెక్కడిదీ పద్ధతి. కట్నమన, కళ్యాణ సమయమున నిచ్చునది కాని లంచమువలె, రహస్యముగా నింటికిఁ దీసికొనిపోయి యిచ్చునదియా?

పురు :- లింగరాజుగారి సంగతి యెరిఁగియు వెర్రిపడెదమేమి? ఐన నీ పాడుపని యందరిలో జరుగుట కంటె నిదే మేలు.

భ్రమ :- అందుల కిప్పుడయిన పని యేమి?

పురు :- అప్పు బుట్టుట యెంతకష్టమో అది తెలుసుకొనుటయైనది.

సీ. మానాభిమానముల్‌ మాపుకోవలయును
        విసుగును గోపంబు విడువవలెను
   సమయంబు గనిపెట్ట సంధింపవలయును
       త్రిప్పినట్లెల్లను దిరుగవలెను
   నీవె దేవుఁడవని సేవింపవలెను
       ఇచ్చకంబుల మురియింపవలెను
   బ్రోకరు రుసుమును బొడిగింపవలెను
       దరి గుమాస్తాగానిఁ దనుపవలెను

   నాల్గు రెట్లేని యాస్తి కన్పఱుపవలెను
   వడ్డి యెంతన్నఁ దలయొగ్గవలెను షరతు
   లేమి కోరిన శిరసా వహింపవలెను
   పుట్టునెడ నప్పటికిఁగాని పుట్ట దప్పు.

భ్రమ :- ఇంతకు, మన కెచ్చటనైనఁ బుట్టినట్లా?

పురు :- పుట్టినచో నీ పురాణ మంతయు నెందులకు? ఆ పది యఎకరముల భూమిమీదను అయిదువేల కంటె నిచ్చువా రగ పడలేదు.