పుట:Varavikrayamu -1921.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

45


చూచినందులకుఁ గూడ సుంకమీయవలె నేమో!

కమ :- సుంక మిచ్చియైనఁ జూడఁదగిన యందమే యక్కా!

కాళిం :- అందమున కేమిలే అయిదు వేల అయిదువందల కిమ్మతు గల బొమ్మ కాపాటి యందమైన నుండకుండునా?

కమ :- అంతబెట్టుకూడదక్కా! అరకంటనైన నీ యంద మొక్కసారి చూడుము! (అని మరలఁ బటమును జూపఁబోవును.)

కాళిం :- (త్రోసివేసి తప్పించుకొని) అబ్బా! అంతకంతకు నీ యాగడ మధికమగుచున్నది సుమా! అంత యందగాఁడని తోఁచినచో హాయిగ నీవు పెండ్లి యాడుము!

కమ :- ఔనౌను! ఎక్కడ మగఁడు దొరకని యెడల నక్కమగఁడే దిక్కను సామెత యుండనే యున్నది గదా? ఇరువురము నింటఁబడితిమి, ఇచ్చిన సొమ్మునకు వడ్డీయైనఁ గిట్టించుకొందము.

కాళిం :- లేదా యిరువురము నీళ్ళబిందెలు మోసి యింటి వెచ్చమయినఁ గడుపుదుము.

కమ :- హాయి హాయి! ఆముక్క యందముగా నున్నదే!

కాళి :- సరికాని ఆ పటము నీకెట్లు వచ్చినది?

కమ :- శుభలేఖలలో వేయించుటకై మొన్న మన ఫోటోలు తీసిన నరేంద్రునిచేత నాన్నగారు తీయించినారట.

కాళి :- వ్యవహారమప్పుడే శుభలేఖల వఱకు వచ్చినదా?

కమ :- రాదా మరి? ముహూర్తమింక మూడు వారములే గదా యున్నది? అరుగో నాన్నగారు వచ్చుచున్నారు.

కాళి :- (ఒక నిట్టూర్పు విడిచి, లోపలికి జక్కంబోవును.)

కమ :- నాన్నగారు! నరేంద్రుఁడీ ఫోటో యిచ్చి వెళ్ళినాఁడు.

పురు :- (చూచి) సరే నీ యొద్ద నుంచుము. మీయమ్మ యేమి చేయుచున్నది? (అని పడక కుర్చీలోఁ గూలఁబడును.)

కమ :- ఇదిగో యిచ్చటికే వచ్చుచున్నది. (అని నిష్క్రమించును.)

భ్రమ :- అదే మట్లున్నారు? ఎక్కడికి వెళ్ళినారింత సేపయినది?