చతుర్థాంకము
మొదటి రంగము
కమ :-(కాగితము చుట్టకట్టిన ఛాయాపటము పట్టుకొని ప్రవేశించి) ఎప్పుడో మేడమీఁది నుండి యేమరుపాటుగఁ జూచుటయే అని సూటిగ నెన్నడుఁ జూచియుండలేదు. అందువల్ల ముందుగానే నేను జూచి ఆ వెనుకక్కకుఁ జూపెద. (అని కట్టువిప్పి, పటమును బయిటకి దీసి, పరికించి) సెబాసు! చేసికొన తగ్గవాఁడే.
ఉ. కన్నులు చాల పెద్దయవి; కన్బొమలుం గడు దీర్చిదిద్దిన
ట్లున్నవి; సోగయై తనరు చున్నది నాసికయున్, లలాట మ
త్యున్నతమై యొసంగుఁ; గురులొత్తనియే యనవచ్చు; జాలునీ
వన్నెయు నన్నిటం దగినవాఁడె లభించెను నేఁటి కక్కకున్.
(బిగ్గరగా) అక్కా! అక్కా! ఒక్కసారి యిటు వచ్చితివా- నీకొక చక్కని తాయం చూపెద!
కాళిం :- (చటాలునఁ బ్రవేశించి) ఏమా తాయము?
కమ :- (పటమును దాఁచి) ఒకచిత్రము చూపిన నా కేమిచ్చెదవే?
కాళిం :- అబ్బా? చంపక అదేమో చెప్పవే?
కమ :- చెప్పితినిగా చిత్రమని.
కాళిం :- ఎవరి చిత్రము?
కమ :- బావది!
కాళిం :- ఏ బావది?
కమ :- ఇంకే బావ! అయిదు వేలా అయిదు వందల బావ! ఇదుగో చూడు! (అని పటముఁ జూపఁబోవును.)
కాళిం :- (తొలగి) చాలు! చాలు! చూడనక్కరలేదు?