పుట:Varavikrayamu -1921.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

వరవిక్రయము


నిజానికి నిలివెడు ధనమిచ్చినా యీపాటి పిల్లవాడు మాత్రం ఇక సందర్భపడడు.

పురు :- పోనిండింకను రవంత దూరము పోయి చూతమా?

పేర :- పోవుటకేం పోవచ్చును ఆ సులువు బలువు లాలోచించుకో వలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచింతా మంటే అవకాశంలేదు. మనం మళ్ళీ వచ్చేసరి కీముండాకొడుకు మంగళం పాడేస్తాడు.

పురు :- అనవసరమగు నాలస్యమే కాని అది మాత్రమేమి చెప్పఁ గలదు? ఇంకొక మాట యని చూతము రండు.

పేర :- అయితే, ఒక పనిచెయ్యండి. ఆవెధవతో వేలంపాట నాకిష్టంలేదు. ఆఖరుమాటని యింకో ఐదువందలమాంతంగా పెట్టండి, దానితో దిమ్మతిరిగిందా, తిరుగుతుందీ. తిరక్కపోతే, తిన్నగా ఇంటికి చక్కాపోదాం ఏమిశలవు?

పురు :- సరేరండు, (అని పేరయ్యతో మరలలోపలికేగి) లింగరాజుగారు! మరియొక్క మాట యనిపోవుదమని మరల వచ్చినాను. ఇంకొక యైదు వంద లిచ్చెదము. ఇష్టమున్న మా క్రింద స్థిరపరుపుడు, లేదా, యింతటితో మాకు సెలవు.

లింగ :- మూర్తిరాజుగారి క్రింద స్థిరపరిచి నట్టుత్తరము వ్రాయుటకు మొదలు పెట్టినానే, సరే సమాప్తి కాలేదు కనుక దోషములేదు. ఏమి వీరయ్యా! వీరి క్రింద స్థిరపరుప వచ్చునా?

వీర :- వారు నాకిచ్చిన వర్దీ యెంతవరకో, అంతవరకూ పాడాను. టెల్లిగ్రాపిచ్చి తిరిగి ఆర్డరు తెప్పించుకునేవరకూ ఆగండి.

లింగ :- అదేమన్నమాట, అయిదు నిమిషము లాగను. పెద్ద మనుష్యుల కడ పేచీలు పనికిరావు! అయ్యా తమ క్రింద ఖాయము.

పేర :- తథాస్తు! పంతులుగారూ! తమవద్ద పదిరూపాయలు లుంటే ప్రస్తుతము బజానా క్రింద జమకట్టించండి.

పురు :- (రూపాయలు తీసి యిచ్చును)

పేర :- తమరు కాస్త రసీదుముక్క వ్రాసి యిప్పించండి.

లింగ :- అభ్యంతరమేమీ? (అని రసీదు వ్రాసి చదువును)