పుట:Varavikrayamu -1921.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము

41

పురు :- (రోషముతో) సరే కానిమ్ము నాలుగువేల నాలుగు వందలు.

వీర :- అయిదువందలు

పురు :- ఆరు; రా యెంతవరకు రాగలవో రా.

వీర :- రాక విడిచి పెడుతానా? యేడువందలు.

పురు :- ఎనిమిది ?

బస :- (తనలో) బాగు బాగు! ఫార్సులాగునే యున్నదే!

గీ. పేకల నోకులం బాడు వీఁక నడి బ
   జారులో గుడ్డలం బాడు సరణి; పెండ్లి
   కొడుకు నిటు మధ్య నిడి, కసి గొన్న యట్లు
   వేలముం బాడు టెన్నఁడు యెరుంగ !

లింగ :- వీరయ్య! వీరిక్రింద ఖాయపరుప వచ్చునా!

వీర :- అప్పుడేనా? అయిదువేలు?

పేర :- (లేచి) బాబూ, యీ బేరం మనకు కుదిరేదికాదు లేవండి.

పురు :- అయ్యా! సెలవు తీసుకొను మనెదరా?

లింగ :- సందర్భము లన్నియుఁ దమరు స్వయముగా జిత్తగించుచు నన్ను నెప పెట్టుట న్యాయమా!

పురు :- సరే మీ చిత్తము. (అని లేచి పేరయ్యత బైటకేగును)

వీర :- కొంపతీసి, బేరం గోవిందా కొట్టదుగద?

లింగ :- వెర్రివాఁడా! పేరయ్య అంత పెయ్యమ్మ యనుకొంటివా?

వీర :- నన్ను మెచ్చుకోరేం? నా పాఠం నేనెల్లా వప్పగించాను?

లింగ :- నిత్యము గోర్టులలో బ్రతుకు ముండకొడుకవు; నీకిదిలెక్కా (అని యేదియో వ్రాయుచున్నట్లు నటించును.)

బస :- (తనలో) వీరి ప్రసంగంబట్టి వీరేదియో కుట్ర సాగించునట్లు కనబడుచున్నది. వీరయ్య ఫాల్సు పాటగాడై యుండును.

పేర :- (బయటను) పంతులుగారు! బహుదూరం వెళ్ళారు. ఇంతదూరం వెళ్ళడం నాకిష్టంలేదు. వెళ్ళకచేసేదీ కనపడలేదు. ఆ ఏల్నాటి శనిముండాకొడుకు లేకపోతే ఏంచక్కా ఫయిసలయ్యేది! చెరపడానికి చేటపెయ్యచాలును!