పుట:Varavikrayamu -1921.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

వరవిక్రయము

లింగ :- ఆహా! అట్టి యవకాశమేయున్న నదృష్ట మేమనవచ్చును!

గీ. సంపద మహత్వ మెరుగని చవట బ్రహ్మ
   చావు లేకుండగా నేని సలుప డయ్యె
   చచ్చునప్పుడు వెను వెంట సకలధనము
   తీసికొనిపోవు విధమేని తెలుపడయ్యె. (తెరపడును.)

రెండవ రంగము

ప్రదేశము: లింగరాజుగారి కచేరి చావడి

(ప్రవేశము: పురుషోత్తమరావుగారు, లింగరాజుగారు, బసవరాజు, పేరయ్య, వీరయ్య చాపలపైఁ గూరుచుండి)

లింగ :- విన్నావా? మున్నంగివారికిని, మాకును మూడుతరముల నుండి సంబంధ మవిచ్ఛిన్నముగా సాగుచున్నది. మూర్తి రాజు పంతులు గారా సంగతులన్నియు నెత్తుకొని మూరెడుత్తరము వ్రాసినారు. అందుచేత నింత దూరమాలో చించవలసి వచ్చింది-

వీర :- మూడు తరలానాటి సంబంధ మొకటేనా? మూడువేల రూపాయల కట్నమో!

పేర :- వీరయ్యా! నీ గొడవ మా విపరీతంగా వుందే! మూడు వేలు మూడువేలని యిక్కడికి ముప్పయిసార్లన్నావు. ముష్టి మూడువేలు మేరేకాని మేమివ్వలేమనుకున్నావా? లింగరాజుగారు! ఆ మొత్తం మే మే యిస్తాము. మా కింద ఖాయం!

వీర :- అదేమన్నమాట? మీరథికంగా అన్నదేముంది?

పురు :- అట్లయిన నింకొక యైదువంద లధికముగా నిచ్చెదము.

వీర :- మా పంతులుగారు మరియైదువందలు.

పేర :- వొయ్యోయ్? వద్దుసుమా వొద్దు! మా పంతులుగారి సంగతి తెలియక మాజోరుగా వస్తున్నావు! మాట దక్కదు సుమా.

వీర :- పేరయ్యా నీ బెదిరింపులకు నేను జడిసేవాడ్ని కాను! మా పంతులుగారు పెట్టమన్న మొత్తం వఱకూ పెట్టిమరీ తీరుతాను.