పుట:Varavikrayamu -1921.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము

27


వెర్రివెంకటాయలు! పత్రికలనియుఁ బరిశోధన లనియుఁ, సంఘ సంస్కరణము లనియు, సహాయ నిరాకరణము లనియు, స్వరాజ్యమనియు, చట్టు బండలనియు, పనిలేని గొడవలు పయిఁబెట్టుకొందురు. కాని వడ్డీలు పెరుగుటకు వాటమైన సాధన మొక్కరును జూడరు?

ఆ. కలుపు పెరుఁగునట్లు; -కంచెలుం బాదులు
    పెరుగునట్లు నాచు పెరుఁగునట్లు;
    వడ్డి పెరిఁగెనేని వహ్వా! యదృష్టము
    పండె ననఁగ నిండ్లు నిండిపోవె!

వాస్తవమునకు వడ్డీకి సాటియైనది మరియున్నదా?

ఆ. నిజముకన్న గల్లఁ నిశ్చయంబుగఁ దీపి
    బిడ్డకన్న ముండ బిడ్డ తీపి
    కరము, వేతనంబు -కన్న లంచము తీపి
    వసుధ, మొదలుకన్న వడ్డి తీపి!

(అంతలో స్మృతి నభినయించి) అన్నన్నా యెన్నడునులేని దీపూట ప్రాతఃకాల లక్ష్మీప్రార్థనము మాట పరాకు పడితిని గదా! (అని చెంపలు వైచుకొని, యినుపపెట్టె యెదుట నిలిచి చేతులు జోడించి)

దండకము: భగవతీ! భాగ్యలక్ష్మీ! ప్రణామంబు! నీ దాస దాసానుదాసుండ. నీపాదముక్తుండ, నీ దివ్యరూపంబె నిత్యంబు భావింతు, నీదివ్య నామంబె నిక్కంబుగా నిద్రలోఁగూడఁ జింతింతు, నాదిక్కు, నామ్రొక్కు, నా యండ, నా దండ నీవే సుమా! భార్యయుం, గీర్యయుం; బిడ్డలుంగిడ్డలు; దేవుడుం, గీవుడున్‌; మోక్షముం, గీక్షమున్‌; సర్వమున్నీవె! సత్యంబు! నీకై నిరాహారినై యుందు, నీకైనిశల్‌ నిద్రమాన్కొందు, నీకై శరీరాభిమానంబు వర్జింతు, నీకై యసత్య ప్రమాణంబు లెన్నేనియు గావింతు నీయాన! ఈపెట్టెయే నీ పవిత్రాలయం; నేనె నీ యర్చకుండన్‌; యథార్థంబుగా నాదు ప్రాణంబులెనీదు పూజాసుమంబుల్‌; శరీరంబె నైవేద్య కుంభంబు, నాయింటనేయుండి, నాపూజలం గొంచునే యింటికే నంపినంబోయి యా యిల్లు మట్టంబు గావించి నా ఇంటికిం దెచ్చినాకిచ్చుకే చుండంగదే కన్నతల్లీ! నమస్తే! నమస్తే! నమః.