పుట:Varavikrayamu -1921.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

వరవిక్రయము

పేర:- రంగుకేమీ రాజా రంగు. అంత యెరుపూ కాదు. అంత నలుపూకాదు, చక్కని చామనచాయ.

భ్రమ:- చామనచాయ యిప్పటివారికి సరిపడుట లేదండి.

పేర:- అలాగైతే నాదెళ్ళవారి పిల్ల వాడు మీ నాకాని కాగుతాడు. పచ్చిగా పనసపండు. నలుగు రన్నదమ్ములు. నలుగురకూ నాలుగైదువందలు రెండువేలు వస్తాయి.

భ్రమ:- అబ్బే! ఐదువంద లీదినములలో నొక యాదాయమా?

పేర:- ఐతే, ముంజులూరి ముత్తయ్యగారి దత్తపుత్రుడికి మూడువేలు వస్తాయి. ముఖం చంద్రబింబాన్ని మించి వుంటుంది.

భ్రమ:- అవునుగాని అతఁడు మా పిల్ల కంటె ఆరంగుళాలు పొట్టి?

పురు:- ఓసి, నీ యెంచుబడి యేట గలియా! ఈ విధముగా నెంచుటకు మొదలు పెట్టినచో లోపము లేనివాడు లోకములో నుండునా?

పేర:- బాబూ! యింకా యేం చూశారు! ఇతర్ల తో పోల్చిచూస్తే యీ యమ్మ చాలా మెరుగు. ఒక్కొక్క ఇల్లాలి సంగతి చూస్తే వొళ్లు మండిపోతుంది! సర్వవిధాలా నచ్చిన సంబంధమేమైనా వచ్చి యడిగినప్పుడు వంకలు పెట్టడం, మించిపోయాక మిడకడం!

భ్రమ:- అయ్యా! ఆఁడుపిల్ల లకుఁ గావలసిన హంగులు మగవారి కేమి తెలియును? ఆఁడుబిడ్డ పెండ్లి యన, మగవారికి అప్పుదీర్చుకొనుటఁ యని యభిప్రాయము!

పేర:- అవునమ్మా! అవును అవశ్యం ఆలోచించవలసిందే కాని మీ మాటనుబట్టి, మీ మనసులో ఏదో సంబంధం తగిలే వున్నట్టు తట్టుతోంది. అట్టే మమ్మల్ని చంపక, అదేమో చెప్పితిరా బ్రతుకుతాం.

భ్రమ:- (నవ్వి) చెప్పమనెదరా? సింగరాజు లింగరాజుగారి దత్తపుత్రుడు, నా బుద్ధికి రవంత నచ్చినాఁడు.

పురు:- ఆ పిల్లవాఁడాలోచింపఁ దగినవాఁడే. స్కూలు ఫయినలు చదువుతున్నాఁడు, చూపరి, నడతగూడ నాణెమయినదె యని విన్నాను. కాని, రెండు సందేహము లున్నవి. మొదటిది యేఁబదియవ వడిలో మూఁడవపెండ్లి చేసికొన్న మూఢునితో సంబంధము చేయనాయని. రెండ