పుట:Varavikrayamu -1921.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము

21

భ్రమ:- అట్ల యినచో, నేటి స్థితినిబట్టి, నేను గోరినవే ముఖ్యంగాఁ జూడదగినవి. ఏమనెదరు? బియ్యే ప్యాసయినవా రుద్యోగములు లేక, ప్లీడరు గుమాస్తాపనికోసము పిచ్చెత్తినట్లు తిరుగుచున్నారు! ప్లీడర్లు బోణీలేక, వీసెడు వంకాయల ఫీజునకు విలేజి కోర్టులకు సిద్ధపడుచున్నారు! చదువుల సంగతి యీ సరణిగా నున్నది. ఇఁక సంప్రదాయము సంగతి చూచినచో అయిన కుటుంబము లడుగునఁబడినవి. కాని కుటుంబములు గణనకు వచ్చినవి! ఇంత యేల! నిత్యము మనము చూచు నిర్భాగ్యులలోఁ జాలమంది సంప్రదాయ కుటుంబములలో జన్మించిన వారే! ఏమి లాభము! సంపత్తులేని కులీనుఁడు శ్మశానములోని తులసి మొక్క వంటివాఁడు! కాబట్టి ఈ దినములలో నింత కలిగిన సంబంధమే యాలోచింపఁదగును.

పేర:- అమ్మా! మీ మాటలు నాకు అరటి పండొలిచి చేతిలో పెట్టినట్లున్నాయి. కాని కలిగినవారి కోసం చూస్తే కట్నం కాస్త హెచ్చు కాకమానదే? నిన్నగాక మొన్న, నీళ్ళ కావిళ్ళ నీలకంఠం గాడి కొడుకుకు వెయ్యిన్నూటపదహార్లు రొక్కం, వెండి కంచం, వెండి చెంబులు, బంగారం భరువు, పట్టు తాబితా, రిస్టువాచీ, సిగరెట్ల కేసూ ఇంకా ఏమిటో వాటిపేర్లు నాకు తిన్నగా రావు. బ్యాట్టట, సెల్ఫు షేవింగు రేజరట, ప్యాకెట్టు టాయిలెట్టు బాక్సట, వ్యాసలైను సీసా అట; వల్లకాడట, యిన్నిస్తే పుస్తె ముడేశాడు. గొప్పవారిమాట చెప్పవలసిం దేముంది?

భ్రమ: -సరే కానిండు, సమయమును బట్టి నడువక తప్పునా?

పేర:- అయితే యింకేమీ! ఆపాటి ధైర్యమిచ్చారంటే కొండమీని కోతిని తేగలను. ఇదుగో ఇప్పుడు చెపుతాను వినండి. మంత్రిప్రగడ మాధవరావుగారి పిల్లవాడికి మాన్యాలమీద రెండువేలు వస్తాయి. మాటాడమంటారా?

భ్రమ:- ఆ పిల్ల వానిది అడ్డతలండీ!

పేర:- అయితే పోనివ్వండి. పచ్చమట్ట బాపిరాజుగారి పిల్లవాడికి పన్నెండు వందలు వస్తాయి. ప్రేమరీ పేసయ్యాడు. కుదర్చనా?

భ్రమ:-రంగు.