పుట:Varavikrayamu -1921.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

వరవిక్రయము


తమాషా కమ్మవారిలో చూడాలి! వారిలో నల్ల బంగారమే కాని తెల్లరూపాయలు పనికేరావు. ఆ నల్లబంగారం కూడా యకరాల లెక్కపోయి పుట్లలెక్కలోనికి దిగింది. పదిపుట్ల భూమికి వచ్చినవాడు పనికిమాలినవాడే? ఈ మధ్యనో యీత మొద్దుకు ఇద్దరు భార్యలుండగా ఇరవైపుట్ల భూమితో ఇంకో పిల్లను కట్టబెట్టారు! నాలుగురోజుల క్రిందట నలభయ్యారేళ్ళ నలుగురి బిడ్డల నాలుగో పెళ్ళి పెళ్ళికొడుకుకు నలభై పుట్ల యీనాంభూమి, నలభై వెయ్యినూటపదహార్ల రొక్కమూ, నలభైతులాల గోపతాడు, నాలుగుతులాల చుట్లూ, నాలుగుజతల యెడ్లూ, రెండు బళ్ళూ, పదివందల గజాల పాటిమన్నూ, ముప్ఫయిబళ్ళ ముక్కిన పెంటా సమర్పిస్తూ వియ్యపరాలికి ఆరుపాడిగేదెలూ, వియ్యంకుడి కైదుబళ్ళ గోగునార యిస్తె, పుస్తె ముడేశాడు! విన్నారా?

గీ. బ్రాహ్మణులయింటఁ దొలుఁదొ ల్తఁ - బ్రభవమొంది
   కోమటింటను ముద్దులు గొనుచుఁ బెరిగి,
   కమ్మవారింట పెళ్ళునఁ గాఁపురంబు
   సేయుచున్నది కట్నంపుఁజేడె నేఁడు.

భ్రమ:- సరి కాని సంబంధము లేమున్నదో చెప్పినారు కారు.

పేర:- అలాగైతే, సంబంధాల విషయంలో మీ యభిప్రాయము ఏమిటో సంగ్రహముగా ముందు సెలవివ్వండి. మీకు కావలసింది: చదువా? చక్కదనమా? సంపత్తా? సంప్రదాయమా? లేక చదువూ సంప్రదాయమా, సంప్రదాయమూ సంపత్తూ; సంపత్తూ, చక్కదనమూ, చక్కదనమూ చదువూ, చదువూ సంపత్తూ, ఈవిధంగా వుండవలెనా?

పురు:- నాకేమో చదువు, సంప్రదాయము వీనిపై నున్నది. దానికేమో చక్కదనము, సంపత్తు వీనిపై నున్నది. మీరు మా యుభయుల కోరికలు తీఱునట్లు చూడవలెను.

పేర:- అంటే నాలుగూ వున్నవాడు కావాలన్నమాట. కాని, నాలుగూ వున్నవాణ్ణి నేనుగాక సరిగదా నన్ను పుట్టించిన బ్రహ్మదేవుఁడు కూడా తేలేడు! ఏమంటారా? వారాలు చేసుకున్న వాజెమ్మకుగాని చదువబ్బదు; పరువొల్లని పీనాసికికాని భాగ్యం పట్టదు! ఇట్టి స్థితిలో, నాలుగూ వున్నవాణ్ని తేవడానికి నాతరమా, నాయబ్బతరమా?