పుట:Varavikrayamu -1921.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము

19


ణములచేత నీ పిల్లలకుఁ గట్నమిచ్చి పెండ్లి సేయుట కిష్టములేక ...

పేర:- తెలిసింది తెలిసింది. అక్కడి కాగి, ఒక్క మాటకు సమాధానము చెప్పండి? పదేళ్ళ నుండి పాటుపడుతున్నారు గదా? యిప్పటి కొక్కరిచేత నయినా మానిపించగలిగారా? వట్టిది బాబూ! వట్టిది! మచ్చుకైనా మానేవారుండరు. వ్రేలెడు కుర్రవాడు కనబడితే వేలకు వేలు వేలం పాడేటప్పుడు, వెఱ్రా, పిచ్చా, మానడానికి! ఇంత యెందుకూ? ఇదివఱకు కోర్టులో, ఇంత ఇన్‌కమ్‌టాక్సు యిస్తున్నామంటే ఘరానా. ఇప్పుడో - మాఅబ్బాయి కింతకట్నం యిచ్చారంటే ఘరానా! ఈలాటి స్థితిలో ఎవరు మానుతారు! వద్దు బాబూ వద్దు! ఈ పిచ్చి మాత్రం యిక విడిచిపెట్టండి. అమలాపురంలో, వెనక, అయ్యగారి అంబయ్యగారిల్లాగె కట్న మివ్వనని భీష్మించి కూర్చుండేసరికి కన్య సమర్తాడి వూరుకుంది! ఆపాటున, నలుగురూ ఆంక్షచెయ్యడం, ఆబ్రాహ్మణుడాపిల్లనో బ్రహ్మసమాజిగాడి కంట గట్టడం, ఆపిల్ల కాపరానికి వెళ్లి అయిదుగురు బిడ్డలను కనడం యిన్ని జరిగాయి!

పురు:- అట్ల యినఁ,గట్నములేని సంబంధము కన్నొడుచుకున్నను లభింపదన్న మాటయేనా?

పేర:- లక్ష యేళ్ళు తపస్సు చేసినా లభించదు. ఎవరైనా తేగలిగితే కుండనాలు పెట్టుకుందామని కుట్లు పెంచుకుంటూ వున్న నా చెవులు కుదుళ్ళలోకి తెగగోయించుకపోతాను! ఇంతెందుకు పెద్ద పెద్ద లిప్పుడు బేరాలతో పనిలేకుండా బల్ల మీద రేట్లు రాయించి, బయట తగిలిస్తున్నారు. వెంగలేటివారు వేయిన్నూటపదహార్లు, రెటూరివారు రెండువేలు, ముంజులూరివారు మూడువేలు, నందరాజువారు నాలుగువేలు, అయ్యంకివారు అయిదువేలు, చింతలూరివారి చిన్నవాడు తూగినన్ని రూపాయలు ఎవరి మట్టుకు వారీవిధంగా యేర్పాట్లు చేసుకుని కూర్చున్నారు. ముందుముందు చీట్ల మీద రేట్లువ్రాసి షాపులలో వస్తువుల కంటించినట్లు పెళ్ళికుమాళ్ళ ముఖాలకు అంటిస్తారని కూడా అనుకుంటాను!

పురు:- రామరామా! రానురాను దేశ మే స్థితిలోనికి వచ్చినది?

పేర:- అయ్యా! మీరు దీనికే ఆశ్చర్యపడుతున్నారు. కట్నాల