పుట:Varavikrayamu -1921.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

వరవిక్రయము

వృత్తులు రోసి, సంపత్తు లర్పణచేసి
    నట్టివారికి లేరె యాడుఁవారు
భోగముల్‌ వీడి, కారాగారముల మాడి
    నట్టివారికి లేరె యాడుఁవారు

కొంద ఱీ రీతి పందలై? గోడుమాలి
మగదనము చంపుకొని, తమ మగువల కెదు
రాడ నేరక వారలేమనిన శిరము
లూఁచుచుం గుక్కలైపడి యుంద్రుగాని!

భ్రమ:- చివరకేమి సిద్ధాంతపఱచినారు?

పురు:- అదే పాలుపోవుట లేదు. దారిలో దై వికముగా పెండ్లిండ్ల పేరయ్య యెదురుపడ - మా యింటి కొకసారి రమ్మని మఱి మఱి చెప్పిమాత్రం వచ్చినాను.

భ్రమ:- పెండ్లిండ్ల పేరయ్య యెవరు?

పురు:- ఎవరా? పెండ్లిండ్ల పేరయ్య యనియు, వివాహాల వీరయ్య యనియు నీ యూరిలో నిరువురు బ్రాహ్మణులు. ఈ చుట్టుపట్ల నే వివాహము జరిగినను వీరి చేతులపై జరుగవలెను.

భ్రమ:- సరిసరి తెలిసినది, చక్కని పని చేసినారు. ఆయనతో నాలోచించి, అతిశీఘ్రముగాఁగార్యములగు సాధనము చూడుఁడు. పెద్దమ్మాయికిఁ బదుమూఁడవ యేఁడు కూడ వెళ్లవచ్చినది. చిన్నమ్మాయి దానికన్న నొక యేఁడాది మాత్రమే చిన్నది. కట్నముల పట్టుదలచేత నిప్పటికే కాలహరణమైనది. ఈ మాఘములో నిరువురకును ముడి పడకున్నచో ముప్పు వాటిల్లకమానదు. ఏ యెండ కాగొడుగు పట్టకతప్పదని నే నెంత మొత్తుకున్నను వినిపించుకొన్నారు కారు. ఈపాటిమార్పు మీమనస్సున కిదివరకుఁగలిగినచో అల్లురతో నీపాటికి హాయిగా నుండెడివారము!

పురు:- వెర్రిదానా! అల్లురనెదవేమి? అల్లురుకారు - అధికార్లు! కావుననే - ఆఁడుబిడ్డలం గన్న యపరాధము క్రింద - సాగదీసి సంచుల కొలది జరిమానాలు వసూలు చేయుచున్నారు. కాకున్న కాళ్లు కడిగి కన్యనిచ్చువారి కీ కట్నముల దండన యెందులకు?