పుట:Varavikrayamu -1921.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము

13


నుక్కిరి బిక్కిరి చేసుకొనుటయే కాని - పని వచ్చినప్పుడు పట్టుదల సున్న! బాల్య వివాహములనఁ బటబట పండ్లుకొఱకు బాపిరాజుగా రేమి చేసినారో విన్నావా?- అభము శుభము నెఱుంగని యాఱేండ్ల పిల్లను, నలుబది యేండ్లు గడచిన నాల్గవ పెండ్లి వానికి ముడిపెట్టి - అదే మన - అత్తగారి పట్టన్నారు! స్త్రీ పునర్వివాహముల కొఱకుఁ జిందులు తొక్కిన శివయ్యగారు బంగారు బొమ్మవంటి పదునారేండ్ల చెల్లెలికి భర్త చావఁగానే, వంటలక్కను మానిపించి, వంట తపేలా చేతికిచ్చి - అదేమన, మా యమ్మ చావనిమ్మన్నారు. శవవాహనమును గూర్చి శంఖములు పూరించు శరభయ్యగారు - ప్రక్క యింటి యిల్లాలు భర్త చచ్చి, శవవాహకులకు డబ్బిచ్చు శక్తి లేక దేవుడాఁ గోడా యని దేవులాడుచుండ వీధి తలుపునకు గొండ్లెము వైచి, విత్తెడు నై వేద్యముపట్టి, పెరటి త్రోవన పేకాటకు జక్కబోయి - అదేమన ఆమె వచ్చి అడుగలేదన్నారు! విన్నావా? వీరేకాదు- ఈ యూరి సంఘ సంస్కర్త లందఱు నిదే మాదిరి!

భ్రమ:- అయిన నొకసారి యాలాపించి చూడకపోయినారా?

పుర:- ఆహా! ఆయాశ కూడ దీర్చుకొనియే వచ్చినాను ఎవరితోఁ బ్రస్తావించిన నొక్కటియే పల్లవి! నా కిష్టమే కాని మా వాళ్లు పడనివ్వరండి" యను మాటతప్ప మాఱుమాట లేదు!

భ్రమ:- వారన్నదియు వాస్తవమే. కట్నము లేదన్న నాఁడుది కంఠమున కురిపెట్టుకొను దినములు వచ్చి - మాట దక్కుట కవకాశము లేనప్పుడు, మాబాగని తలయూఁప వలసినవారె కాని - మగవారు మాత్రమేమి చేయఁగలరు!

పురు:- అదేమన్నమాట - ఆఁడుదానిమాట కింత యడుగుదాఁటలేని యధములు దేశారాధన మేమి చేయఁగలరు?

సీ. చదువులు మాని స్వేచ్ఛగ దేశభటకు లై
        నట్టివారికి లేరె యాడుఁవారు
    రాచఠీవుల నెట్టి రాట్నముల్‌ చేఁపట్టి
        నట్టివారికి లేరె యాడుఁవారు