పుట:Varavikrayamu -1921.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరవిక్రయము

ప్రధమాంకము

ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.

ప్రవేశము: పంటెను నూలు చుట్టుచు భ్రమరాంబ,

(చరకాగానముతో నూలు వడకుచు కాళింది, కమల.)

కాళింది, కమల:-(మోహనరాగము - ఆది తాళము.)

చరకా ప్రభావం బెవ్వరి కెరుక! జగతిలోన మనచరకా॥

సిరులతోడఁ దులఁదూగుచున్న యల-

సీమజాతి చూచుచున్న దేమఱక.చరకా॥

చ. సాలున కిరువదికోట్ల రూప్యములు - సంపాదించెడు వారికె గాక
    మేలి చేతిపనులు మాపుకొని - మేటి బానిసలమైన వెనుక,చరకా॥
    పాటవమగు సామ్రాజ్యముఁ గూర్చున్‌ - పరిమితి లేని ధనంబును
    జేర్చున్‌ కాటక రాకాసిని బరిమార్చున్‌ సాటిలేని యొక జాతి నొనర్చెన్‌. చర.

కాళింది:- అమ్మా! అదేమే - చేతిలోని నూలు చేతిలోనే యున్నది!

భ్రమ:-ఈ పూఁట నా దృష్టి యీపని మీఁద లేదే! మీ నాయనగారు మిల్లెగరిటెఁడు కాఫీనీళ్లు గొంతులోఁబోసికొని, ప్రొద్దునబోయిన పోక - యింతవఱ కింటికి రాలేదు! పండ్రెండు కొట్టి పావుగంటయైనది! ఎక్కడికి వెళ్లినారో యేమి పనిమీఁద నున్నారో తెలియదు!

కమ:- నాయనగారి కిప్పుడింకేమి పని యున్నది? - అహర్నిశలు అల్లుళ్ళను వెదకుటక్రింద సరిపడుచున్నవి.

భ్రమ:-అమ్మా! యేమి చేయుమనెదవు? ఆఁడుపిల్లలఁగన్న వారి యవస్థ యిప్పు డీ స్థితికి వచ్చినది!

గీ.కన్య నొక్కరి కొసఁగి స-ద్గతులు గాంతు
  మనుచు సంతోషపడు కాల - మంతరించి,