ద్వితీయాశ్వాసము
76
చ. తగనికుమారుఁ డైన మమతారహిత స్థితి యొప్పుఁ దండ్రికిన్
దగనిసహోదరుం డయినఁ దానును బాయుట యొప్పు నన్నకున్
దగ దని నిగ్రహించినను దాదృశు లౌదురు గాన వానితో
దగ దికఁ బొత్తు నీ కొక హితం బెఱిఁగించెద విన్ము పుత్త్రకా. 249
శా. లీలోద్యానలతాకుడుంగవిహర ల్లేఖాంగనాహాసరు
గ్జాలప్రసవదిందుకాంతలహరీసంబంధమందాకినీ
నాళీకోత్పలవాసనాజనిత కాంతాయుగ్బలోల్లాస మౌ
కైలాసంబు వసింప నీకుఁ దగు నింకన్ జేరు మచ్చోటికిన్ 250 .
ఉ. అచ్చటి కేళికావనము లచ్చటి కల్పిత భూధరోచ్చయం
బచ్చటియచ్చపుంగొలఁకు లచ్చటి బంగరుఁజయతమ్మి పూ
లచ్చటిరత్నమందిరము లాత్మకు మె ప్పొనగూర్చునే కదా
యచ్చటికాఁపురంబునఁ బురారి సఖుం డగుఁ బొమ్ము నావుడున్ 251
చ. జనకునియాజ్ఞ మౌళి నిడి సమ్మద మొప్ప ధనేశుఁ డప్పుడే
ధనమణివస్తువాహనకదంబము సేకొని యాశ్రితుల్ హితుల్
దనయులు సైనికుల్ గొలువఁ దక్కక లంకఁ బరిత్యజించి శం
భుని శరణంబుఁ జేరి ప్రియ పూర్వముగా శరణంబు వేఁడినన్ . 252
క. శరణాగతసులభుం డగు, హరుఁ డాతని నాదరించి యలకాహ్వయ మౌ
పుర మిచ్చి మెచ్చి మచ్చికఁ, బరమాప్తునిఁగా నొనర్చి పరిపాలించెన్. 253
క. అనయము వినయము నయమును, దనసొమ్ముగ మెలఁగుకీర్తిధనుఁ డెచ్చటి కే
గిన నిష్టార్థముఁ జేకొనుఁ, గన రామ ధనేశుఁ డిటుల కాంక్షిత మొందెన్ .254
§§§ రావణుఁడు మొదలగు రాక్షసులు లంకలోఁ బ్రవేశించుట §§§
మ. జనలోకేంద్ర కుబేరుఁ డి ట్లరుగఁ ద్రింశద్యోజనీదీర్ఘయై .
కనకోద్భాసితసౌధ యై సుగృహ యై కన్పట్టునాలంక ని
ర్జన యయ్యున్ జెలువొందె నొక్క విభుఁడాసన్ గూడి వీడ్కొన్నఁ జ
య్యన వేఱొక్కనిరాకకున్ దనరు వేశ్యాకాంత చందంబునన్ 255
ఉ. అంతఁ బ్రహస్తుడున్ జని దశాస్యున కెంతయు వేడ్క నంతవృ
త్తాంతము విన్నవింప దరహాసముతో సభవారిఁ జూచినన్
వింతయె నీభుజామహిమ వీఱిడి యై పగఁ బూన రాజరా
జింతకు గాసి గాఁడె పుర మీయక యుండిన నంచు వారనన్. 256
శ. అది నిజ మౌనని పలుకుచు, మదిలోన ముదంబు వొదల మంచి ముహూర్తం
బిది యని భార్గవనందను, లదురుగడన్ వచ్చి తెలుప నద్దశముఖుఁడున్. 257
సీ. తనపురోవీథి మాతామహుల్ మదమత్తమాతంగములమీఁదఁ బ్రీతిఁ జనఁగఁ
దనతల్లి కైకసీధవళాక్షి ముత్యాలపల్లకిపై వారిపజ్జ నరుగఁ