Jump to content

పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

47

    శిష్టాచారము మేలుబంతి పలలాశిశ్రేణికిన్ శాత్రవా
    నిష్టోత్సాహనిధాన నీకుఁ దగునే నేఁ డింత చింతింపగన్ . 16

మ. విశిఖోత్తుంగతరంగఘుంఘుమరవోద్వేలంబు దుర్మారవీ
     రశతాంబూద్భటసంకులంబు సముదగ్రచ్ఛత్ర ఫేనావృతం
     బు శతాంగాద్రియుతంబు నౌసురబలాంభోరాశి నీ బాడబో
     గ్రశరజ్వాలల నింకె; నెవ్వ రెదు రింకన్ నీకు దైత్యాగ్రణీ. 17

మ. బలవంతుల్ భవదీయ పుత్త్రకులు నీభ్రాతల్ త్రిలోకైకవీ
     రులు నిన్ మృత్యువు దేఱి చూడ వెఱచున్ రుద్రాచ్యుతాంభోజగ
     ర్భులు నీపే రనినన్ దలంకుదురు భీరుత్వంబు నీ కేల నిన్
     దెలియన్ జాలక యానతిచ్చెదవు దైతేయాన్వయగ్రామణీ, 18

తే. అస్మదాదులు సేయురాయిడి సుపర్వు
     లచ్యుతునితోడఁ దెలిపినా రనియె భయముఁ
     జెందెదవుగాని మనలను జెఱుప నింత
     కెత్తుకొని రని యలుగ వదేమి యధిప, 19

మ. అరులన్ జంపు మటంచుఁ బంద లయి యయ్యాదిత్యు లార్తిన్ గణిం
     చిరి పో సర్వసమానుఁ డైనహరి ద్వేషిత్వంబుఁ దాఁ బూని యే
     కరణిన్ గయ్యము సేయ వచ్చు మనతోఁ గ్రౌర్యంబుఁ గౌటిల్య మా
     హరికిన్ గల్గిన మాదృశుం డతఁడు గా కాధిక్య మే మారయన్. 20

తే. సహజమాత్సర్యమున దేవసమితితోడ,
    మనము దొడరిన హరియేల మచ్చరించు
    నతఁడె నిష్కారణ ద్వేషి, యయ్యె నేని,
    సంధి కార్యంబు వొసఁగునే సరసగతిని.

తే. వనజనాభుండు గనుపించుకొను నటంచు
    వెఱచి పగతుర పైఁ గిన్క విడువవలెనె
    యేటియోజన బలవంతుఁ డీహరి యని
    యిపుడు శరణన్న నవ్వరే యెవ్వరైన. 22

తే, వెన్నునకు నస్మదాదుల మెన్నఁడైన, నపకృతి యొనర్ప మతఁ డెన్నఁడైన మనకుఁ
    జేయఁ డపకృతి వేల్పులు సేసి రింత, వేలుపులమీఁద నిఁక దండు వెడలవలయు.

చ. త్రిదశులతోడఁ గయ్య మొనరించి రమాపతి యస్మదాదులన్
    గదిసి రణం బొనర్చినను గా దన వచ్చునె యంత భాగ్య ము
    న్నదె యెటు లైన మంచిది రణం బొనరింతము వేదశాస్త్రముల్
    సదివితి మీవు లిచ్చితిమి జన్నము లూనితి మైహికంబునన్.

తే. అన్న నీమాట జవదాఁటి యాడితి మని
    యలుక సేయక ప్రతివాదములు క్షమించి
    యనుమతి యొసంగు మిపుడే మదాంధు లగుసు
    ధాంధుల జయించి వచ్చెద మనుచుఁ బలికి. 25