శ్రీరస్తు
శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః
శ్రీమదుత్తరరామాయణము
ద్వితీయాశ్వాసము
—: o :—
శ్రీ రాధామధురసుధా
ధారాధరలోల కామితప్రదశీలా
శారీరశ్రీజితనవ
ధారాధరజాల శ్రీమదనగోపాలా. 1
తే. అవధరింపుము కుంభసంభవమహర్షి , చంద్రుఁ డిట్లను శ్రీరామచంద్రుఁ జూచి
జానకీనాథ సుర లిట్లు శార్ఙ్గిచేత, నభయదానంబుఁ గొని వేడ్క నరిగి రంత. 2
§§§ మాల్యవంతుఁడు విష్ణుప్రభావమును దమ్ములకుఁ దెల్పుట §§§
శా. ఆవృత్తాంతము వేగరల్ దెలుపఁగా నాలించి యమాల్యవ
ద్దేవద్వేషి, నిజానుజద్వయము నెంతేఁ గూరి రప్పించి మం
త్రావాసంబున నుండి యి ట్లనియె నేకాంతంబుగా శేముషీ
ప్రావీణ్యంబును గార్యతత్పరత సౌభ్రాత్రంబుఁ గాన్పింపఁగన్ . 3
ఉ. వింటిరె తములార యొకవింత వినంబడె మొన్న నేమొ ము
క్కంటిఁ గనంగ నెల్ల తెఱగంటి దొరల్ మును లేఁగి మ్రొక్కి మీ
బంటుల మమ్ము నొంచెదరు బాధలఁ బెట్టి సుకేశ పుత్త్రుల
క్కంటకులన్ వధించి మముఁ గావఁ గదే శివ యంచు వేడినన్ . 4
చ. కరచలనంబు మస్తకవికంపనముం గనిపింప వారితో
హరుఁ డపు డానతిచ్చెనఁట యాయసురేంద్రులు మా కజయ్యు లా
హరి యగునే జయించుఁ జనుఁ డాయనయొద్ద కటంచు నట్ల సు
స్థిరమతి వార లేఁగి రట శీఘ్రముగా నసురారియొద్దకున్ . 5
చ. హరునకుఁ దెల్పినట్ల మనయాగడముల్ హరితోడఁ దెల్ప నా
హరి వెత లేల శాత్రవచయంబు వధించెదఁ గొంచ కింక మీ