2
శ్రీ మ దు త్త ర రా మా య ణ ము
అనఁగా సృష్టిలో నేయే భూభాగమున దుర్మార్గులు ప్రబలి ధర్మమును నశింపఁజేసి యధర్మమును స్థాపింపఁ బూనుదురో; ఆ భాగమునందుఁ దా నవతరించి దుర్మార్గులఁ జెండి మరల ధర్మసంస్థాపన మొనరింతును భయపడ వలదని యానతిచ్చెను. ఆ లక్ష్మీపతి తానానతిచ్చినప్రకారము దుర్మార్గులు ప్రబలినపు డంతయుఁ దానేదో యొక రూపముం దాల్చి వచ్చి దుష్టసంహారంబును శిష్టపరిపాలనంబును గావించుచుండెను. అట్టి భగవంతుని లీలలనే భాగవతు లవతారంబులని పేర్కొనిరి. అట్టి యవతారంబు లసంఖ్యాకములు. అయిన నేలకో ప్రాజ్ఞులు
శ్లో. మత్స్యః కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః
రామో రామశ్చ రామశ్చ బౌధ్ధ కల్కి మేవచః.
అను దశావతారములకే ప్రాముఖ్యము నొసంగిరి. మనము కూడ భగవంతుని యవతారంబు లసంఖ్యాకము లనియు నందు బుధులు సెలవిచ్చిన రీతిఁ బైని బేర్కొన్న దశావతారములకే ప్రాముఖ్యము నొసంగుదము.
ఇఁక నవతారంబు లెన్ని విధంబులో కొంత చర్చించి యావల మన విషయమునకు వత్తము. అవతారంబు లంశావతారంబులు, సంపూర్ణావతారంబులని రెండు విధములు. దశావతారములలో శ్రీరామావతారము సంపూర్ణావతారమని మహనీయు లందురు. కనుక మన కథానాయకుఁడగు 'శ్రీరాముని' అవతారమును గూర్చి చర్చింతము.
పూర్వము సనకసనందనాది మహాఋషుల శాపంబునకు గుఱియైన జయవిజయులను లక్ష్మీకాంతుని ద్వారపాలకులు తాము సత్వరముగ శ్రీమహావిష్ణుసన్నిధానమును జేర నుద్దేశించి మూఁడు జన్మములు నారాయణునకు విరోధులుగనే జన్మింపఁ గోరినది సర్వజనవిదితము. ఆరీతిగా జయవిజయులు ముందు హిరణ్యాక్షహిరణ్యకశ్యవులుగ జన్మించి శ్రీమన్నారాయణమూర్తిచేఁ బొలియింపంబడి రెండవ జన్మంబున రావణ కుంభకర్ణులై జనించిరి. అద్దానవుల నిర్జించుటకే శ్రీ విష్ణుమూర్తి రామావతారమును దాల్పవలసి వచ్చెను.
ఇపుడు కొందఱు వితండవాదులు శ్రీవిష్ణుమూర్తి 'రామ' అను పేరు తోడనే యేల అవతరింప వలెనని వాదింతురు, భగవంతుఁ డేనామమున యవతరించినను ఫలిత మొకటియే యని గుర్తింపవలెను. అందునను 'రామ' అను