పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

ఉపోద్ఘాతము

–––:o:–––

ఈ మహా ప్రపంచమును సృష్టించిన సృష్టికర్తయే ప్రపం చమందలి జీవకోటి కంతటికిని నధిపతియని మన మొప్పుకొనక తప్పదు. ఆ మహానుభావుఁడే సృష్టి లయ కారకుఁడై ప్రపంచ మందలి యాయా ఖండములలోఁ బలు తెఱంగులఁ గపట నాటక ఖేలన మొనరించు చున్నాఁడు. ఆ మహామహుని లీలల నర్థము చేసికొనఁగల మహాపురుషుఁ డిఁక ముందేమో కాని యిప్పటి వఱకు జన్మించి యుండలేదని మా యభిప్రాయము. ప్రపంచ మందలి మానవకోటి కంతకు నొకే సృష్టికర్త యని మేము మరలఁ జెప్పఁ బని లేదు. అట్టి సర్వేశ్వరుని సృష్టిలో మత కుల భేదములకుఁ జోటు లేకుండెను. అందఱును నాది మధ్యాంత రహితుఁడగు సర్వేశ్వరుని తమ యిచ్చవచ్చిన తెఱంగున సేవించు చుండిరి. అటుల జరుగుచుండ రాను రాను మానవులలో విపరీత బుద్ధులు పొడసూపి,దుర్మార్గులు ప్రబలి సన్మార్గులను బాధింపఁ దొడఁగిరి. సన్మార్గులు దుర్మార్గుల నెదు ర్కొనఁ జాలక ఆదిమూర్తి యగు శ్రీమహావిష్ణువును బ్రార్థించి తముఁ జెనటుల బారినుండి రక్షింపఁ గోరిరి. అందుకు శ్రీమన్నారాయణుఁడు వారిం జూచి శ్లోకము -

                    యదా యదాహి ధర్మస్య
                                  గ్లానిర్భవతి భారత!
                    అభ్యుత్థాన మధర్మస్య
                                  తదాతానం సృజామ్యహం. 1
                    పరిత్రాణాయ సాధూనాం
                                  వినాశాయచ దుష్కృతాం
                    ధర్మ సంస్థాప నార్థాయ
                                 సంభవామి యుగే యుగే. 2
                                              ––– (భగవద్గీత - 4 వ అధ్యాయము.)