పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము

103

ఉ. ఇంతటిధర్మశాలి నిఁక నెవ్వ రెదుర్కొని గెల్చువారు ర
    మ్మంత ప్రియంబు గల్గినటు లైన రణం బొనరింప నేనె ని
    న్నంతకుచెంతకున్ బనుతు నంతకు నేఁ దగువాఁడ నంచు నం
    తంతకు రోస మీసు బెరయన్ ధరణీశుఁడు లేచె చెచ్చెరన్. 146

మ. శరచాపంబులు పూని వజ్రకవచస్ఫారప్రభల్ భూనభోం
    తరముల్ నిండ నజాండఖండనసముద్యచ్ఛింజినీనిస్వన
    స్ఫురణన్ రాజు దశాస్యుపైఁ జనఁగ నచ్చో నడ్డ మై ధారుణీ
    శ్వరచూడామణి పోకు పోకు మని సంవర్తుం డుదాత్తధ్వనిన్. 147

చ. పలికె బళా మఱేమి మది భాసిల దీక్ష వహించి శత్రుపై
    నలుగుట నాయమే యిది మహాక్రతు వించుక విఘ్న మైనచో
    గులము నశించు నద్దశముకుండును దుర్జయుఁ డేల వీనితోఁ
    జల ముపసంహరింపు పరుషత్వము నా విని యమ్మరుత్తుఁడున్. 148

శా. ఆసంవర్తునిమాటఁ జేకొని పరిత్యక్తాస్త్రకోదండుఁ డై
    యీసున్ రోసము నుజ్జగించి చన దైత్యేంద్రుండు వీక్షించి నా
    తో సంగ్రామము సేయ నోపక మరుత్తుం డోడెఁ జుండీ యటం
    చాసన్నాద్రిగుహావళుల్ బదులు మ్రోయన్ బెట్టు చాటింపుచున్. 149

ఉ. అమ్మఖశాలఁ జొచ్చి కుపితాత్మకుఁ డై మునికోటిఁ ద్రుంచి యూ
    పమ్ములు పెల్లగించి పశుపంక్తి హరించి ఘృతంబు వహ్నికుం
    డమ్ముల నించి హోతల నడంచి యహో తల మంచు యాజకుం
    డమ్మెయిఁ బల్క నొక్కగతి నక్కడఁ బాసి చనెన్ బలంబుతోన్. 150

క. హరిహయముఖ్యులు భయములు, గిఱికొన శిఖికాకహంసకృకలాసగతుల్
    ధరియించి యమ్మహాపదఁ, దరియించి తదీయహితము దలఁచి ప్రియోక్తిన్. 151

సీ. కన్ను లీ కలచంద్రకములుగా ఘనవేళ నెమ్మిగా నెమ్మి కొసఁగెఁ
    బెద్దకాలముమన్కి ప్రేతాత్మకతభుక్తి గలుగఁగా జముఁడు కాకమున కొసఁగెఁ
    బాలును నీరు నేర్పఱుచునేర్పుఁ బయోవిహారంబు నుదధీశుఁ డంచ కొసఁగెఁ
    దల వెండివలెనుండఁ దనువు బంగరుఁజాయఁ దులకించ ధనరాజు తొండ కొసఁగె

తే. నివ్విధంబునఁ దమతమయెలమికిఁ దగు
    వరము లజ్జంతువుల కిచ్చి వారు సవన
    భాగముల్ గొనిపోయి రప్పార్థివుఁడును
    మఖము నెఱవేర్చె సంవర్తమౌనికరుణ. 152

చ. అటుల మరుత్తభూవిభునియజ్ఞధరాస్థలిఁ బాసి యార్చుచున్
     బటహమహార్భటుల్ దిశలు బ్రద్దలు సేయ నజయ్యుఁ డై ధరా
     విటులఁ బరాక్రమోద్భటుల వీఁకనెదుర్చుచు నోప మన్నచో
     నటఁ దన గెల్పుఁ దెల్పుచు దశాస్యుఁడు ద్రిమ్మరె భూమి యంతయున్.153