Jump to content

పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

శ్రీమదుత్తర రామాయణము

క. కని యెవ్వరిమఖమో క, న్గొని రమ్మని శుకుని సారణునిఁ బనుప హసా
   దని పోయి తెలిసి క్రమ్మఱి, వినిపించిరి యిట్టు లనుచు వింశతిభుజుతోన్. 138

సీ. అవధారు జయరమాయత్తుఁ డైనమరుత్తసర్వంసహాభర్త సవనకర్త
    యమరేజ్యుననుజుఁ డుగ్రమహత్త్వశాలి సంవర్తకుండు క్రతుప్రవర్తకుండు
    బలభేదిశమనాంబుపతిముఖ్యు లనువేల్పు మన్నె వారు వహించుకొన్నవారు
    కశ్యపాత్రివసిష్ఠకౌశికాదులు పుణ్యభాజనమ్ములు తత్సభాజనములు

తే. హైమమణికాంతిఁ దగుశాల యజ్ఞశాల
    మెచ్చినాఁడు హరుం డర్థ మిచ్చినాఁడు
    విప్రయోగంబు మునులచే సుప్రయోగ
    మైన దని వారు దెల్పఁగా నాలకించి. 139

శా. ఆహా నాయెదుటన్ మఖం బొకటి సేయన్ బూనెనే వెఱ్ఱి యా
    బాహాజన్ముఁడు విఘ్న మెట్లొదవదో భాగంబు లె ట్లందఁ గా
    నూహన్ సేసిరొ చూత మీసుర లటంచు గ్రాహవక్రీడనో
    త్సాహశ్రీ వహియించి యచ్చటికి దైత్యస్వామి యేతేరఁగన్. 140

సీ. నమ్మియున్నను గ్రమ్మి దొమ్మి సేయు నటంచు నెమ్మిరూపు సురాధినేత దాల్చె
    నాఁకొన్న హరిఢాక చేకొన్నవాఁ డంచుఁ గాకవైఖరి దండకరుఁడు పూనె
    మించినాఁ డితఁ డాక్రమించి యే మెంచునోయంచు నంచవిధంబుఁ గాంచె వరుణుఁ
    డొండు చూడండు మూర్ఖుండు మండు నటంచుఁ దొండయై గండాఱియుండె ధనదుఁ

తే. డితరు లాతురు లై జాతిహీనరూప, ధారు లై పాసి రంత నద్దశముఖుండు
    దారుణాకారుఁడై మరుత్తక్షితీంద్రు, కట్టెదుట వచ్చి నిలుచుండి యిట్టు లనియె.141

క. ఓయి మరుత్తణిక్షితివర, యే యుద్ధాపేక్ష నిచటి కేతెంచితి నా
    తో యుద్ధమైనఁ జేయుము, వే యేటికి వెఱచితేని వెఱచితి ననుమా. 142

మ. నను నీరాజులలీలఁ జూడవల దన్నన్ నవ్వుతో నమ్మరు
    త్తనృపాలాగ్రణి శత్రుకోటికులగోత్రప్రాభవాచారముల్
    వినకే యుద్ధము సేయ నెవ్వఁడవు నీవృత్తాంత మాద్యంతమున్
    వినఁ గాంక్షించెదఁ దెల్పు నావుడు మరుద్విద్వేషి గర్వంబునన్.143

మ. విను ముర్వీశ్వర నేఁ బులస్త్యకులుఁడన్ వేధోవరోద్యత్ప్రతా
    పనిరూఢుండ దశాస్యనామకుఁడ మద్భ్రాతన్ ధనాధీశు ము
    న్ననిలో గెల్చి విమానమున్ గొని త్రిలోకాతీతమాహాత్మ్య మొం
    దినవాఁడన్ రణభిక్ష యిమ్మనినఁ బృథ్వీనాయకుం డి ట్లనున్. 144

చ. అవుర మ ఱేమి నీ మహిమ యన్నను గెల్చితి నన్నమాట వి
    న్న విశద మయ్యె నాయనధనం బగుపుష్పకమున్ గ్రహించినాఁ
    డవు భళి యింట గెల్చికద డయ్యక రచ్చల గెల్వఁ బోవలెన్
    భువనములందుఁ గీర్తియును బుణ్యము దీన సమృద్ధిఁ జెందవే. 145