Jump to content

పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

శ్రీరాముకథ నేవిధముగ వర్ణింపఁ బూనినను దద్రచనచే శ్రీరాముని ప్రేమకుఁ బాత్రుఁడై తద్వారా మోక్షమును బడయు తలంపు ననే యని మా తలంపు.

ఉత్తర రామాయణము - ఇంతవఱకు శ్రీ రామాయణమును గుఱించియు, ఆరామాయణమునే పలువురు కవులు గ్రంథకర్తలు అనేక రీతుల సంస్కృతాంధ్ర భాషలలో రచించుటను గూర్చియు దానిని బహుభాషలలో తర్జుమా చేయుటకు హేతువును గూర్చియు వివరించితిమి. ఇఁక ఉత్తరరామాయణమును గూర్చి చర్చింతమన్న దీని నెందఱోకవులు రచ్చింప లేదు. ఇప్పటివఱకు ఉత్తర రామాయణమును రచించిన కవిపుంగవులలో భవభూతి సంస్కృతమున ఉత్తర రామచరితము అను పేర నాటక రూపమునను, మహాకవి తిక్కన తెనుఁగున ఉత్తర రామాయణమును రచించినట్లు తెలియుచున్నది. ఆగ్రంథములు పాఠకులకు లభ్యము కాగలవు. ఈ గ్రంథద్వయము తప్ప నితర గ్రంథములు కంకంటి వారి ఉత్తర రామాయణమునకుఁ బ్వూరము రచింపఁబడినవి కానంబడుట లేదు. పై మూఁడు గ్రంథములలోఁ గంకంటివారి ఉత్తర రామాయణమునకున్న వ్యాప్తి తక్కిన రెండు గ్రంథములకు లేదని చెప్పుటలోఁ బొరపాటుండదని తలంచు చున్నాము. పది గుడిసెలు గల పల్లెటూరు మొదలుకొని పట్టణముల వఱకు నాంధ్రభాషను జదువ నేర్చిన యెవ్వరిని గాని ప్రశ్నించిన కంకంటి పాపరాజు కృత ఉత్తర రామాయణము నే బేర్కొందు రనుటలో నతిశయోక్తి లేదనక తప్పదు. పూర్వకవులలో నేమి,ఇప్పటికవులలో నేమి ఉత్తర రామాయణమున కంటె లావు గ్రంథముల రచించినవారనేకులు గలరు కాని పాప మేలకో వారికిఁ గాని వారి గ్రంథములకు గాని కంకంటి పాపరాజుకు నతని ఉత్తర రామాయణము నకుఁ గలిగిన వ్యాక్తి కలుగక పోయినందులకు మేమెంతయుఁ జింతించు చున్నామన నా గ్రంథకర్తల కెట్లుండునో గదా!

కంకంటి పాపరాజు - ఈ ఉత్తర రామాయణమును సృష్టించిన శ్రీకంకంటి పాపరాజు సుమారు వంద సంవత్సరములకు పూర్వముండిన కవులలోఁ జేరిన వాడు. అనఁగాఁ బదు నెనిమిదవ శతాబ్ది మధ్యభాగమున నీయుత్తరరామాయణమును రచించినట్లు తెలియుచున్నది.

ఇతఁడు బడగలనాటి కన్నడ తెగనుండి యుద్భవించిన నియోగిశాఖ యుపశాఖలగు నందవరీక ఆర్వేల అను నియోగి శాఖలలో ఆర్వేల నియోగి శాఖకుఁ జేరినవాఁ డనియు, అబస్తంభసూత్ర శ్రీవత్స గోత్రజుఁ డనియు గ్రంథకర్త