Jump to content

పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

95

    గట్టువిల్లు వట్టినదిట్ట యెట్టు మట్టుపెట్ట కున్నవాఁడో యని యొక ళ్ళొకళ్లతోఁ బలుకుచుఁ గనుంగొనఁ
    బ్రత్యంతపర్వతంబు లున్మూలంబు లై పొడ వడంగఁ బెద్ద పెద్ద గండోపలంబులు పై పై నుండి
    పెళపెళమనుచప్పుళ్లతో డుల్లి చఱులనురలి పడన్ బడలు వడక బాతాళంబులోఁతుగనుపాఁ తగలించి
    పుండరీకంబుఁ బెకలించు మదవేదండప్రకాండంబుడంబున ఝరీమండలహారిపరంపరలు నలువంకలఁ దొరంగ
    ఖనిస్థలీవినిర్గతనీలమణీరమణీయమధుకరంబులు నలుగడలఁ జెదరఁ గనకవకుళకేతకీకురంటకాశోకమధూక
    కేసరప్రముఖభాసురకుసుమవిసృమరపరాగవిసరంబు నలుదెసల నొరసికొన నవ్వెండికొండ పెకలించి కందుక
    క్రీడ గావింపగన్ గడంగె నయ్యవసరంబున. 78

మ. అసురాధీశకరావధూతకలధౌతాద్రిన్ బదం బూన లే
     క సఖుల్ గొల్వ వనంబులో మెలఁగునగ్గౌరీసరోజాక్షి మే
     ను సెమర్పన్ దనుమధ్యమున్ వడఁక నాందోళింప నేత్రప్రభల్
     వెస నేతెంచి కవుంగిలించుకొనియెన్ విభ్రాంతయై శంభునిన్ . 79

వ. ఇవ్విధంబున. 80

ఉ. బంగరుఁదళ్కుజెక్కులను బంజులకమ్మలడాలు చిందుద్రొ
    క్కంగ మెఱుంగు జన్నుగవకంచుకపున్ముడి వీడఁగా హఠా
    లింగసుఖం బొసంగినచెలిం గవుఁగింటనె యుంచి యల్గఁ డ
    య్యెం గఱకంఠుఁ డద్రి నతఁ డెత్తఁగఁ గాముకు లెగ్గు లెంతురే. 81

శా. శంభుం డద్రికుమారికాస్ఫురదురోజద్వంద్వశుంభత్పరీ
    రంభం బెట్టుడుపంగ వచ్చు నయినన్ గ్రౌర్యంబు దీఱన్ భుజా
    రంభం బీగతిఁ జెంది యెంతసుఖ మౌరా నెమ్మదిన్ వీనియా
    స్తంభోజ్జృంభ మొకింత మాన్పి పిదపన్ సౌహార్దమున్ జూపెదన్ . 82

క. అని తలఁచి లేఁతనగ వా, ననమునఁ దగ శంభుఁ డాసనము డిగ్గక మున్
    దన వామపదాంగుష్ఠం, బున నదిమె దశాస్యుహస్తములు క్రిందుపడన్ 83

తే. ఇటుల యదిమిన భుజశౌర్య మెడలి బడలి, యడలి యొడలి మదోద్వృత్తి సడలి శూలి
    కాలిపెనువ్రేలు దెమలించి కరము లెత్తు, కొన సమర్థత లేక రజోవిభుండు. 84

మ. కులశైలంబులపెన్ బిలంబులు బదుల్ ఘోషింప శేషాహి మూ
     ర్ఛిల భూచక్రము దిర్దిరన్ దిరగ జేజేపెద్ద భీతిల్లఁ జు
     క్కలు రాలన్ దివి పెల్లగిల్ల సుర లాకంపింప నంభోనిధు
     ల్గలఁగన్ దిక్తటు లొడ్డగిల్లఁ బదినోళ్ళన్ బెట్టు వాపోవఁగన్. 85

క. తలఁచిరి మనుజు లకాండ, ప్రళయం బిది యనుచు దిగులుపడి రమరేంద్రా
     దులు యక్షసిద్ధసాధ్యులు, కలఁగిరి తొలఁగిరి పదంబు గ్రహరాణ్ముఖ్యుల్ . 86

శా. ఈరీతిన్ జగముల్ దలంకఁగను వేయేం డ్లార్తుఁడై కూయఁగా