తృతీయాశ్వాసము
89
పేర్చిన ప్రహస్తాదుల గనుంగొని నిర్ణిద్రరౌద్రంబున మాణిభద్రుండు వానిపై నురవడించిన. 37
శా. ధూమ్రాక్షుం డెడ చొచ్చి శాతశరవిద్ధున్ జేసి పెల్లార్చినన్
దామ్రాక్షుం డయి యక్షు డారిపు గదన్ దాటించినన్ వాతధూ
తామ్రంబున్ బలె వాఁడు మూర్చిల స్వకీయాంఘ్రిస్ఫురద్ఘట్టనన్
నమ్రత్వం బహిరాజు సెంద ఘటకర్ణ జ్యేష్ఠుఁ డత్యుగ్రుఁ డై . 38
క. ఆమాణిభద్రుఁ గదిసి శి, తామితశరవృష్టి గురియ నతఁ డతికుపితుం
డై మూఁడుతూపు లసుర, గ్రామణి పేరురము నాటఁగా చేయుటయున్. 39
ఉ. అందున నొచ్చి పంక్తిముఖుఁ డల్గి గదాహతి మాణిభద్రుమౌ
ళిం దిలకించి కొట్టినఁ జలించి యతం డలమౌళి యోరపా
టొందెఁ దదాదిగా రఘుకులోత్తమ యాయన పార్శ్వమౌళి నాఁ
జెందె నభిఖ్య యంత వెఱుచేఁ బఱచెన్ బరసేన లార్వఁగన్ 40
వ. ఇత్తెఱంగున దళవాయి తొలంగి పోయినన్ గనుంగొని. 41
§§§ ధనదుఁడు యుద్ధరంగమునకు వచ్చి దశగ్రీవునకు బుద్ధులు సెప్పుట §§§
సీ. పిడుగుఁజప్పుడులతోబెడిదంపుటడిదముల్ జళిపించుచును భటావళులు గొలువ
జయజయ నవనిధీశ్వర మహేశ్వరమిత్త్ర యనుచుఁ జారణకోటు లభినుతింప
జవనకంఖాణ రాజము లెక్కి కిన్నరగ్రామణు లుభయభాగములఁ గొలువ
నుద్భటాహంపూర్వికోక్తులు వెలయఁ గింపురుష యోధులును గ్రిక్కిఱిసికొలువ
తే. బద్మ శంఖాద్యనిధులు రూపంబు లూని, కొలువ బంగారుఁ దేరెక్కి గురగదాది
సాధనములొప్పఁ గిన్న రేశ్వరుఁడు వచ్చి, చుఱుకుఁజూపులదశకంతుఁజూచిపలికె.
ఉ. తమ్ముఁడవంచు నీ కొకహితం బెఱిఁగింపఁగ దూతఁ బంచినన్
వమ్మొనరించి నాపలుకు వానిని జంపి ననున్ జయింప రే
ద్రిమ్మరిగుంపుతోడ నరు దెంచితి ని న్న న నేల నీకు డెం
దమ్మున మేలు గాఁ దలఁచు నన్నె యనన్ దగుఁగాక దుర్మతీ. 43
ఉ. రోగికి భక్ష్యభోజ్యముల రోగము హెచ్చుగతిన్ బటుక్రుధా
యోగికి నీకు మాదృశహితోక్తులఁ గ్రోధము మించు మాటికిన్
నీగుణ చర్య లేటి కివి నింద యొనర్పఁగ నీకె తెల్లమౌ
రాఁగలమృత్యువుం బొరసి రౌరవబాధలఁ బొందుచున్నెడన్ . 44
ఉ. ఆపద లావహించుదురహంకృతి నీగతి మూర్ఖుఁడుగ్రపుం
బాపము లాచరించి విషపాన మొనర్చి శరీర మంతయున్
వ్యాపక మైనఁ జింతిలుజడాత్మువలెన్ యమపాశబద్ధుఁడై,
పాపఫలంబుఁ జెందునెడఁ బాపముఁ జేసితి నంచు వందురున్. 45