Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

ఉపన్యాసపయోనిధి.

హిందూదేశములో ద్వైతాద్వైత విశిష్టాద్వైతములు మఱి యితరవేదాంతములును కలవు. ఈవేదాంతములు ప్రపంచములోనికెల్ల నత్యద్భుతములని చెప్పఁదగినవి. మనము వేదాంతము మతముకాదని చెప్పవచ్చును. సత్యమే; కాని వేదాంతము మతముయొక్క ధర్మశాస్త్రమని చెప్పవచ్చును. ఇప్పుడున్న భక్తిమార్గములందు మనకు నమ్మకముపోయినది. ఇప్పుడున్న వేదాంతములందు మనకు విశ్వాసములేదు. ఇఁక మనసోదరులకు మన మొసంగిన భక్తిమార్గమేది ? మనమునమ్మిన వేదాంతమేది ? ఈప్రశ్నలు మనల వేసినప్పుడు, ప్రార్ధింపుడు సత్యము మీకుబోధపడును. క్రమక్రమముగా మీరు తెలిసికొనగలరు. అని మనము సమాధానము చెప్పుదుమేని మనము పొందినజ్ఞానమునకు మనమన్యాయము చేసినవారమగుదుము.)

కావున మనబ్రాహ్మసామాజిక సోదరులకు నున్నతమయిన వేదాంతములేదు. అగ్నినారాధించుట ఉదకమునుబూజించుట ధ్వజములకు ధూపదీపనైవేద్యములను బెట్టుట రాసక్రీడలు జలక్రీడలు సలుపుచు సభలో నుచ్చరించరాని కృష్ణలీలలఁబాడుట గంజాయి భంగు మొదలగువానిని వినియోగించుట మనుజులు దేవతలుగా పూజించుట పొడిప్రార్థనములుగావించుట యిట్టి సామాన్యకృత్యములుమాత్రమే వీరికిఁగలవు. మఱియు చిలుకూరి వీరభద్రరావుగారనువారు ప్రకటించిన ప్రకటనమునుబట్టి యీ బ్రాహ్మసామాజికులం