శ్రీకృష్ణమూర్తి.
277
నాఁడుగాని సామాన్యుఁడుగా వర్ణింపఁబడి యుండలేదు. కొందఱు బాగుగా నాలోచించి చూడక ఛాందోగ్యములో "దేవకీపుత్రుఁడైన కృష్ణుఁడు" అని మాత్రము తెలుపఁబడి యుండుట చే నప్పటికింకను అవతారమూర్తిగా భావింపఁబడుట లేదని సాహసించి వ్రాసియున్నారు. ఇది యసంగతము. తైత్తిరీయములో “నారాయణా యవిద్మహేవాసుదేవాయ ధీమహి" అని వాసుదేవుఁడు నారాయణుఁడైనట్లుగా లెస్సగా వ్రాయఁబడియే యున్నదిగదా. ఇఁక సందేహమున కవకాశమెక్కడిది?
అయినను ఇతర దేశస్థుల గ్రంధములలో నీవిషయ మెట్లున్నదో విచారింతము.
ఇతరగ్రంధ దృష్టాంతము.
“గ్రీసు” దేశస్థుఁడగు “మెగాస్తెనెసు” అనునతఁడు క్రీస్తుపుట్టుటకుఁ బూర్వము 4 వ శతాబ్దమున మనహిందూదేశము వచ్చినాఁడు. ఈతఁడు మనదేశము గూర్చి కొంతగ్రంధము వ్రాసియుంచినాఁడు. ఈతఁడు మనదేశమునందలి యొక్క దైవతమును గూర్చి ముచ్చటించి యున్నాఁడు. ఆవర్ణనమునుబట్టి యాదైవతము తప్పక కృష్ణుఁడు కావలెనని ప్రాజ్ఞులు చెప్పుచున్నారు.
ఇంతయేల గ్రీక్కుదేశస్థుల పురాతనగ్రంధములందుఁ గూడ కృష్ణుఁడు వర్ణింపఁబడి యున్నాఁడు. విద్వద్వరులగు