Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీశంకరభగవత్పాదులవారు.

263

సన్న్యాసమునుస్వీకరించిరి. ఇట్టివారిమనస్సు మొదటినుండియు విశేషపరిణతిగలదనిచెప్పుట కెవ్వరు జంకుదురు? గోవిందతీర్థులవారికడకు నామకముగా శాంతిచేయుటకై చనిరేకాని యద్వైతసిద్ధియంతకుఁ బూర్వమేయైనదికదా. మొన్న మొన్న మనకన్నులయెదుట విశేష మహిమనుజూపిన రామకృష్ణపరమహంసకుఁ బరమాద్వైతబోధ నెవరుచేసిరి ? అతఁడు చదువురానివాఁడుగదా ! ఆధ్యాత్మికజ్ఞానము బహుజన్మతపః ఫలముగానుండునుగాని యెక్కడో ఏవియోచధువుకొనిన వచ్చునదికాదు. అధ్యాత్మవిద్య మిక్కిలి కష్టమైనదనుమాట నిజము. అది యేపూర్వజన్మతపః ఫలముచేతనో కొందఱు మహాత్ముల కొరులుచెప్పకయే కలుగుటయును నిక్కము. అందుమూలముచేతనే యిట్టివాని దివ్యమహిమకలవారని లోకరహస్యవేత్తలు చెప్పుదురు. కాన నద్వైతాచార్యులగు శంకరజగద్గురువులు గోవిందయతీంద్రులకడకుఁ బోవునపుడే యద్వైత సిద్ధికలవారని చెప్పుట కెంతయుజంకఁబనిలేదు.