పుట:Upanyaasapayoonidhi (1911).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమంతం బగు నీ భరతఖండమునందంతటను విఘ్నేశ్వరాధనము విపులముగా జరుగుచున్నది. ఏనామముతోనైన నేమి గణాధిపతిని హిందువులందఱును బూజించుచున్నారని చెప్పవచ్చును. ఈయారాధనము మిక్కిలి పురాతనము. వేదములందే గణపతియుగ్గడింపబడియున్నాడు. "నిషుసీదగణపతే! గణేషుత్వామాహు:" అను ఋక్కులో వినాయకుడు నుతింపబడియున్నాడు. "గణానాంత్వా గణపతిగ్‌మ్‌హవామహే" యను యజుస్సునందుగూడ నీ దైవతము స్తుతింపబడియున్నాడు. కొందఱు పాశ్చాత్యులీ వేదభాగములందు బేర్కొనబడిన గణపతి "బ్రహ్మణస్పతి" గాని వక్రతుండుడుగాడనుచున్నారు. అయ్యది యనాదరణీయము. వక్రతుండుడు బ్రహ్మణస్పతికంటె భిన్నదైవముకాడు. "శ్లో|| విఘ్నేశ! విధిమార్తాండ! చంద్రేంద్రోపేంద్రవందిత! నమోగణపతేతుభ్యం! బ్రహ్మణాంబ్రహ్మణస్పతే!" అని విఘ్నేశ్వరునే బ్రహ్మణస్పతిగా మనవారు వర్ణించియున్నారుకదా. "తత్పురుషాయవిద్మహే వక్రతుండాయధీమహి తన్నోదన్తి: ప్రచోదయాత్" అని తైత్తిరీయోపనిషత్తులో వక్రతుండుడు కీతిన్ంపబడి యున్నాడు. పెక్కేల వినాయకోపనిషత్తని యొక యుపనిషత్తే యీతనిని గూర్చి కలదు.