పుట:Tolstoy Kathalu Volume 01 Tolstoy,(Tr)Bhamidipati Kameswararao 1957 124 P 2020010008959.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌంట్ లియొ టాల్ స్టాయ్

( 1828 - 1910 )

టాల్‌స్టాయ్ రష్యాదేశపు ఇటీవలి సారస్వత చరిత్రలో అత్యున్నతమైన ప్రత్యేక స్థానం ఆర్జించుగున్న మహావ్యక్తి. ఆయన జమీందారీ కుటుంబంలో జనించినవాడైనా, సాధారణ యోధుడుగ సేవలో జేరి రణరంగానికి వెళ్లి, సైనికుల యిక్కట్లు స్వానుభవంవల్ల తెలుసుకున్నాడు. ప్రజలయందు ఆయనకు గల సానుభూతి సత్యధర్మాలయందు ఆయనకు గల ఆసక్తి ఆయన్ని కలం పట్టించాయి. భౌతికమైన భోగాలకి ఆధ్యాత్మికమైన ఆశయాలకీ ఆయన హృదయం నిరంతర సంగ్రామ రంగం అయింది. ఆయన యోచన విప్లవానుగుణం అయినా, ఆయన శక్తి పరిణామవాదపక్షమే. తలపెట్టిన ఉద్యమంలో త్రికరణంగా లీనం అయిపోవడం ఆయన స్వభావం. సకల విధ స్వాతంత్ర్యం ఆయన లక్ష్యం. భూధనధాన్యాదుల అపరిమిత సేకరణకి ఆయన ద్వేషి. తన నైతిక లక్ష్యాన్ని చేరుకోగల మార్గాన్ని తన జీవితం నడుపుకోలేకపోతిని గదా అని చివరిదాకా ఆయన బాధపడ్డాడు. తన యావదాస్తీ వదిలేసి తను వానప్రస్థంలో ఉంటూ ఆయన కర్షక జనానికి తోడ్పడ్డాడు. పైపై జ్ఞానం ఆర్జించి విద్యాధికులం అనుకునేవారి సంకుచితత్వం ఆయన హేళనచేశాడు. ఆయన ప్రజ్ఞ సర్వతోముఖం. ఆయన ఎక్కడ చేయివేస్తే అక్కడ చైతన్యం ఉట్టిపడింది. ఆయన సృష్టి అపారం - నవలలు, నాటకాలు, కథలు, చరిత్రలు, విర్శనలు - అన్నీ చరితార్థం అయినవే. ఆయన శైలి హృదయంగమం.

ఈ సంపుటంలో 23 కథ లున్నాయి. జీవిత సమస్యలలో ఏదో ఒకటి గొప్పది చర్చింపబడిని కథ ఏదీ లేదు. ఈ ఇరవైమూడు కథల్నీ నేను పరిమాణ ప్రకారం క్రమపరిచాను. 'ఈ ఇరవైమూడు కథలు మాత్రమే రచించి ఉండి మరి యితరత్రా యే రచనా టాల్‌స్టాయ్ చేసుండకపోయినా, ఆయన రచనా ప్రసిద్ధి ఇప్పటిలాగే ఉండేది', అని ఒక మహావ్యక్తి చేసిన విమర్శ జ్ఞప్తియం దుంచుగుంటే, ఇవి ఎటువంటి మహిమ గలవో బోధపడుతుంది. ఇందులో ఒక్కొక్కటి, వ్యాసమా, కథా, కథానికా, సామ్యకథా, చరిత్రా, ఆత్మకథా, లేక అన్నింటి సమ్మేళనానా అనిపిస్తుంది.

వీటి ఆంధ్రభాషాంతరీకరణం గురించిన అనుమతికోసం ఢిల్లీలోని 'రష్యన్ ఎంబెసి' వారిని నేను కోరగానే, వారు అనుమతి ఇచ్చారు. వారికి కృతజ్ఞుణ్ణి.

అనువాదకర్త.