పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాంకము

3

చ. నవరసపూరపూరితము నాటకమీయది యంచు నెంచి పాం
    డవ విజయంబుఁ దెల్గున నొనర్చిరి వీరరసప్రధానమున్

నటి- కృతికర్తల పేరు చెప్పరైతిరి.

సూత్ర- చెప్పుచుండగనే నీకింత తొందరయేల?

కవలవలెం జరించుచుఁ బ్రకాస్తి వహించు శతావధానులే
కవులిఁక వారిపేరులు జగద్విదితంబులు చెప్పనేటికిన్?

నటి- తిరుపతి వేంకటేశ్వరులా?

సూత్ర- ఏమీ నీ తెలివితేటలు? చెప్పకయే తెలిసికొంటివి.

నటి- (నవ్వుచు) నీమాటలువినిన 'నేమీ నీ తెలివితేట'లని కాకుస్వరముగానే మరల ననవలసి వచ్చినది. 'వారిపేరులు జగద్విదితంబులు చెప్పనేటికిన్' అనుచు నెట్లు తెలిసికొంటివని యడిగితివేమి?

సూత్ర- ఆ పాండవవిజయ మీ సభాసదుల యానతికిం దగినది. కావున దానిం బ్రదర్శింతము. ఈ నీ చతురవాక్యముల కేమిలే. సంగీతము పాడు చాతుర్యముఁ గనఁబఱచుకొనవలయును.

నటి- ఏఋతువు నాశ్రయించి పాడవలయును?

సూత్ర- మనము ప్రదర్శింపఁబోవు నాటకమున కనుగుణమగు నీశరదృతువునే వర్ణింపుము.

నటి- గీ. ధార్తరాష్ట్రసమూహంబు దక్షిణాశ
          కభిముఖంబుగఁ జను సమయంబుచూవె
          ప్రబల పాండవహంసలు పట్టువదలి
          యచ్ఛమానసవైకల్య మనుభవింప.
                                  (తెరలో)

భరతపుత్రా! ఏల యిట్టి యసంబద్ధాలాపము లుపన్యసింపఁ జేయుచుంటివి?

ఉ. నేఁటికి రెండునాళ్ళు చనె నేను ధనుస్సు ధరించి శాత్రవో
   ద్ఘాటన మాచరించుటకుంగా నని సేయఁగడంగి; సేన నా
   నాఁటికిఁ బాండవేయులది నాశనమందుటె కాని కాన నే
   పాటునులోటుఁ గౌరవులపక్షమునం; దిటు పల్కు టేలొకో
           పాం. వి. 2