పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాదు. ఎప్పటితిండి? ప్రొద్దుపొడుపువేళఁ దిన్నతిండి. ఏమైనను కూడు గుడిచిన గడఁపడిఁగాని యీయనను దాఁటింపఁజాలను. (తలవంచికొని పోవుచుండును.)

పరా- (సమీపించి) ఏమోయి మరకాడా! నన్నావలికి దాఁటింతువు గాని రమ్ము.

దాశు- (తేఱిపాఱజూచి) అయ్యా! దండమండి. దయచేసి యయ్యెడఁ గూర్చుండుండి. మా పిల్లదాని నంపించెదను. అది మిమ్ముల నవల దింపి రాఁగలదు. నాకు సెలవొసంగుఁడు. కూటివేళ దాఁటిపోవుచున్నది (నిష్క్రమించును)

పరా- (తనలో) ఓహో! యేమి వీనియోగ్యత? నా ప్రయాణమున కభ్యంతరము లేకుండఁ దనకొమరె నంపనెంచినాఁడు. కానిమ్ము. ఇంతలో నీ యేటియొడ్డునంగల వృక్షరాజముల సొబగుం దిలకింతుఁగాక. (పరికించి)

సీ. కొమ్మలు దిగవంచి గొడుగుల చందాన
                          సేవించుచున్నట్టి చెట్లు కొన్ని
    జలజలమునఁగఁ బుష్పముల నెల్లెడ రాల్చి
                          కైసేయుచున్న వృక్షములు గొన్ని
    పాఱుటాకులను గుప్పలు తెప్పలుగ నెంచి
                         ఛాదించుచున్న భూజములు గొన్ని
    కడుబెడం గడరు పుప్పొడులచే నొడ లెల్ల
                         మెఱయించుచున్నట్టి తరులు గొన్ని
    తే. గీ. అరమర యొకించుకయు లేక యంతరమునఁ
            బ్రతిఫలించు మహీజసంతతులు గొన్ని
            కలిగి యీనది కనువారి కన్నుఁగవకుఁ
            బండువు నొనర్చుఁ దనదుసంపత్తికలిమి.
            (మత్స్యగంధి పుట్టెతోఁ బ్రవేశించును.)

మత్స్య- అయ్యా! యీపుట్టెలో నెక్కుఁడు. మి మ్మావల దింపి వచ్చెదను.

పరా- (పరికించి ఆశ్చర్యముతో తనలో) ఔరా! యీ జాలరికొలమ్మున కెంత యదృష్టకాలము వచ్చినది! ఏమీ యీ బ్రహ్మదేవుని యవివేకము?

ఉ. జవ్వనమున్ విలాసమును జక్కదనంబును మేల్మిచెక్కులున్
    మువ్వపుఁగన్నులున్ మురువుమాటలు కుల్కుపిసాళిగుబ్బలున్
    నవ్వులతేటలున్ సాలవున్ దగు మేటివిలాసపున్నడల్
    నివ్వటిలంగఁజేసియును నీచపుజన్మము సంఘటించునే?