Jump to content

పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత్ర- (సంతోషముతో)

తే. గీ. అంత సులభమునుం గాక యంత డుల్ల
       భమమ్మునుం గాక మధ్యమఫణితి నలరు
       పద్యమున గల్గు వ్యంగ్యంబు పయికిదీయ
       నేర్చితివి నీదుభర్త వర్ణంప గలడె?

(కౌగిలించు కొనబోవును)

నటి- (సిగ్గుతో దలవంచుకొని కొంచెము తొలగి) ఆర్యా! దీనికి నిగవులు తిరుపతి వేంకటేశ్వరులేనా?

సూత్ర- నీకొక్కటే గుఱుతును జెప్పుచున్నాడను. భారతకథను దెలుగులో స్వతంత్రించి నాటకముగా రచించినవారే లేరు. ఒకవేళనున్నను పాండవ పదచిహ్నితమగు నామ ముంచినవారు లేరు. ఉన్నను సుప్రసిద్ధులు లేరు.

క. పారాశర్య మునీంద్రుడు
    భారతమును వ్రాసె దెలుగు పఱచిరి కవితా
    స్వారాజు లొక్కమూగురు
    వీరిరువురు నాటకముగ నెలయించి రిలన్

(తెరలో) ఎవరక్కడ? పుట్టనిబిడ్డకు బేరు పెట్టుచున్నారు? పరిశుద్ధమగుపరాశిర శబ్దమున కపత్య ప్రత్యయ మనెడి కళంకమును గూర్చు సాహసము గూడనా?

సూత్ర- (విని) తీర్థయాత్రార్థమై బయలువెడలిన పరాశర మునీంద్రుని మాటలు వినవచ్చుచున్నవి. మన మీపాటికి నరుగుదము రమ్ము. (నిష్క్రమింతురు)

ప్రస్తావన.