పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నటి - (తనలో) మత్స్యగంధిని గమ్మందురు కాబోలును. (ప్రకాశము) ఆర్యా! నేను గడపుట యెందులకు? తామే సర్వమును నిర్వహించ గలరు.

సూత్ర- (గౌరవముతో) ప్రేయసీ!

ఆ.వె. పేరు పూరుషులకు దారసించునె కాని

కార్యనిర్వహణము భామినులది

వెన్నలయె జగంపు నెలయింపవలె గాన

చంద్రు డేమిచేయు? జలజనయన!

నటి- చక్కని దృష్టాంతమును జూపితిని పరస్పరసాహాయ్యము వలన సర్వకార్యములు నెఱవేఱు నని తెలిపిరి.

సూత్ర- ఇదియును ననుభూతమే కాని యనేక మహాకార్యములు స్త్రీల వలనే నెఱవేఱినవియును గలవు.

క. కుల మడగిపోవు పదపడి

నిలిపెగదా! యొక్క సాధ్వి, నేడో రేపో

పొలియున్ వంశం బనుతఱి

సెలయించెం గాదె? యొక వివేకిని మరలన్

కావున నెంతటి నిర్వాహకురాండ్రేని స్త్రీలయందు గల రనుటకు సంశయము లేదు.

నటి- (తనలో) ఆర్యుని యుపన్యాసము సత్యవతవిని గుంతిని స్మరణకు వచ్చుచున్నది. (ప్రకాశము) కేవల బ్రహ్మచారులుగా నుండి యనేక మహాకార్యము లొనర్చిన పురుషసింహులు మాత్రము లేరా!

సూత్ర- లేరేమి?

తే.గీ. తండ్రి పెండిలికై పెండ్లి తాను మాని

కేవల బ్రహ్మచారియై కీర్తి కెక్కి

బలిమిమై స్వయంవరమున గెలిచి తెచ్చి

తమ్మునకు బెండ్లి సేయుడే ధన్యు డొకడు

నటి - (తనలో) ఈయన సురాసుర జేగీయమాన పరాక్రమ క్రముం డగు భీష్ముండు (ప్రకాశము) నాధా! మన మీ ప్రసంగములోఁ బ్రకృతమునే మఱచుచున్నారము. నేడు ప్రదర్శింపదగు నాటక మెయ్యది?

సూత్ర - (నవ్వి) వెఱ్ఱిదానా! అయ్యది నాందిలోనే సూచింపబడెనుగదా?

నటి- (యోజించి) పాండవజననము కాదుగదా?