Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

తిక్కన సోమయాజి


"సీ. సుకవీంద్రబృందరక్షకుఁ డెవ్వఁ డనిన వీఁ
             డనునాలుకకుఁ దొడ వైనవాఁడు
    చిత్తనిత్యస్థితశివుఁ డెవ్వఁడనిన వీఁ
             డనుశబ్దమున కర్థ మైనవాఁడు
    దశదిశావిశ్రాంతయశుఁ డెవ్వఁ డనిన వీఁ
             డనిచెప్పుటకుఁ బాత్ర మైనవాఁడు
    సకలవిద్యాకళాచణుఁ డెవ్వఁ డనిన వీఁ
             డనిచూపుటకు గుఱి యైనవాఁడు

    మనుమసిద్ధిమహీశ సమస్తరాజ్య
    భారధౌరేయుఁ డభిరూపభావభవుఁడు
    కొట్టరువుకొమ్మనామాత్యు కూర్మిసుతుఁడు
    దీనజనతానిధానంబు తిక్కశౌరి."

ఈవినుతి కవిప్రపంచము కేతనరూపమున మూర్తీభవించి చేసినదిగాఁ దలంపవలయునుగాని కేవలము తనంతటఁ దానుగాఁ గేతన చేసినదని మనము గ్రహింపరాదు. ఇతరులు చేయుస్తోత్రపాఠముల కుబ్బిపోయి యహంకరించి తమ నిరంకుశాధికారమును జాటి తమ యాధిక్యమును గన్పఱచుకొన వలయు నని వ్యర్థాభిలాషతో దంభాచార్యవృత్తిని వహించి కవిప్రపంచముపై భుజాస్ఫాలనము సేయుచు దండయాత్రలు సలుప నుత్సహించెడు దుష్కవులమార్గమును గొనక యీతఁడు సత్కవులమార్గమును గొని 'బుధారాధనవిధేయుఁడ, బుధారాధనవిరాజి' నని నమ్రభావమును దేఁటపఱచుచుఁ దన కవితాసామ్రాజ్యాభిషిక్తపదవిని సంరక్షించుకొనియెను. వివిధ