పీఠిక.
అప్రతిమానమైన ప్రతిభా విశేషమునుజూపి శ్రీమదాంధ్ర మహాభారతమును విరచించి సర్వాంధ్రలోకపూజ్యుఁడైన తిక్కనసోమయాజి పవిత్రజీవితము ప్రత్యేకసంపుటముగా నుండుట అత్యంతోపయుక్తమను భావముతోఁ దెలిసినంత వఱకుఁగవినిగూర్చిన విషయములనుజేర్చి నేనీ చిన్న గ్రంథమును రచించినాఁడను. తెలిసినంతవఱకుఁ దిక్కనజీవితమును సులభముగా మహాజనులెల్లరును దెలిసికొనుటకొఱకే నేనీగ్రంథమునురచించినాఁడనుగాని తిక్కనసోమయాజి భారతాంధ్రీకరణమును గూర్చికాని, కవిత్వమునుగూర్చికాని విపులముగా విమర్శించి గుణదోషములను బ్రకటింపవలెననుదలంపుతో గ్రంథరచనము గావించి యుండలేదు. ఈగ్రంథమును వ్రాయుటకొఱకు నేనుబరిశీలించిన గ్రంథములపట్టికను మఱియొకతావునఁ దెలిపియున్నాఁడను. తద్గ్రంథకర్తలకును, తద్విలేఖకులకును కృతజ్ఞతావందనముల నిందుమూలముగాఁ దెలుపుచున్నాఁడను. ఈకవి బ్రహ్మనుగూర్చి నూత్నవిశేషములు పొడగట్టినప్పుడు గ్రంథము విస్తరింపఁబడు ననుటకు సందియములేదు. ఇందలిదోషములను మన్నించి గుణములనే గ్రహింపవలయునని పాఠకమహాశయులను బ్రార్థించుచున్నాఁడను. చరిత్రమునకు భిన్నముగానుండినఁ 'నన్నయభట్టు, తిక్కనసోమయాజులఁ' గూర్చినకల్పనా కథలనన్నిటిని గ్రంథవిస్తరభీతిచేనిందు విడిచిపెట్టినాఁడను. స్థలాంతరమున నుండుటచే నిందచ్చుతప్పు లచ్చటచ్చటఁబడుట సంభవించినది గావునఁ జదువరులు వానినిమన్నించి సవరించి చదువుకొనవయునని విన్నవించుకొను చున్నాఁడను.
రాజమహేంద్రపురము,
8 - 10 - 17,
చిలుకూరి వీరభద్రరావు.