పుట:Tikkana-Somayaji.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

తిక్కన సోమయాజి


పద్మనాయఁడును, పల్లికొండప్రభువయిన చల్లాపిన్నమనాయఁడును, దొనకొండ అయితమరాజు ఎఱ్ఱయ్య, భట్టావులరాజు, కరియావులరాజు, వల్లభన్న, నాచకూళ్లనాయఁడు, నేతిముద్దయ్యనాయఁడు, పాచయ్యనాయఁడు, ముమ్మయ్యనాయఁడు, పుత్తమరాజు మొదలుగా గొందఱుయోధులును గాటమరాజునకుఁ దోడ్పడ వచ్చిరి. ఈ సేనకంతకును, చిన్నమనాయని మంత్రియు నారాధ్య బ్రాహ్మణుఁడునగు బ్రహ్మరుద్రయ్య నాయకుఁడై యెదురుగాఁ బోయి పాలేటియొడ్డుననున్న పంచలింగాలకొండకడ నెదుర్కొనియెను. అప్పుడుభయపక్షముల వారికిని ఘోరమైన యుద్ధముజరిగినది. తుదకుఁ దిక్కన సైన్యమంతయు హతముకాఁగా నతఁడొక్కఁడును వీరాధి వీరుఁడై రణరంగమున నిలువఁబడి యుండుటను జూచి ప్రతిపక్షయోఁధుడైన పిన్నమనాయఁడుచూచి,

"కం. పోరునిలుపు మోయిభూసురోత్తముఁ డ
     సరిగాదు మాతోడ సమరంబుఁ జేయ
     అగ్రజుల్ మీరు యాదవులము బేము
     ఉగ్రము మామీద నుంపంగ రాదు."

అని పలికె నఁట, అందుపైని తిక్కన తనతోనున్నసైన్యమంతయు నాశమయి నందులకుఁ జింతించి మరల సైన్యమును గొని వచ్చి యుద్ధము చేసెదం గాకయని గుఱ్ఱమును ద్రిప్పుకొని పురంబునకు వచ్చెనఁట. పౌరజనంబులు పరాజితుఁడై పారి వచ్చిన తిక్క యోధునిగాంచి పకపకనవ్వువారును, కేరడమ