62
తిక్కన సోమయాజి
ఖడ్గతిక్కననుగూర్చినకథయె సాదృశ్యముగా నున్నది. ఆకథనే నేనిచట సంగ్రహముగాఁ దెలుపుచున్నాఁడను.
పసులమేపుబీళ్లనిమిత్తమై కాటమరాజునకును మనుమసిద్దిరాజునకును వివాదము పొసఁగి మహాయుద్ధము జరిగినటులు గాటమరాజుకథవలనఁ దెలియుచున్నది. పుల్లరి యిచ్చుపద్దతి పై గాటమరాజు తనపసులను మనుమసిద్దిరాజు మేతబీళ్లలో మేపుకొని యక్కడఁ దనకోడెదూడలలో నేదోనష్టము సంభవించినదన్న కారణమునఁ పుల్లరి నీయక యెగఁ గొట్టెను. దాని పై మనుమసిద్దిరాజు పసులఁ బోనీయక యాటంకపఱచెను. ఉభయులయుద్ధమున కిదిముఖ్య కారణము. ఈ యుద్ధకథనము ద్విపదలో రామరావణయుద్ధముగ వర్ణింపఁ బడినది. మనుమసిద్ది రావణుఁడుగఁ బోల్పఁ బడియెను. కాటమరాజుతండ్రి పెద్దిరాజు. వానితండ్రి వల్లురాజు. ఇతఁడాత్రేయగోత్రోద్భవు లైన యాదవులసంతతిలోని వాఁడుగఁ జెప్పఁ బడియెను. వల్లురాజు కనిగిరిసీమలోనియాలవలపాడున కధిపతిగనుండెను. కాటమరాజు కనిగిరిలోని యెఱ్ఱగడ్డపాడున కధిపతిగ నుండెను. ఒక సంవత్సరమున దేశమున ననావృష్టి సంభవించెను. యాదవు లనంబడుగొల్లవాం డ్రెల్లను దమతమపసులమందలను దోలుకొని దక్షిణమునకువచ్చి మనుమసిద్దిరాజుయొక్క పసులబీళ్లను గొన్నిటిని పుల్లరికిఁ గైకొని పసులను మేపుకొని పుల్లరి చెల్లింపకయె వెడలిపోయిరి. అందుపై మనుమసిద్దిరాజునకుఁగోపము