Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ యధ్యాయము

35


కీర్తి పాత్రుం డనితెలుపుచు నీక్రింది పద్యముచే నిట్లబివర్ణించెను.

"సీ. వీరారివర్గవిదారణక్రీడ న
          ద్యతనజగత్ప్రాణసుతుఁ డనంగఁ
     బరధనదారాపహర ణానభిజ్ఞత
          నూతనగంగాతనూజుఁ డనఁగ
     నర్థార్థిజనవాంఛితార్థ సంపూర్ణవి
          తీర్ణిమైనభినవకర్ణుఁడనఁగఁ
     గామినీచిత్తాపకర్ష కారణశుభా
          కారసంపదనింత కంతుఁడనఁగ

గీ|| ధీరతాగుణముసమేరుమహీధర
    మన గభీరవృత్తి నబ్ది యనఁగ
    వెలసె వైరిరాజ వేశ్యాభుజంగాంక
    భూషితుండు సిద్దిభూవిభుండు."

ఇట్టిమనుమసిద్ధి భూపాలునికడఁ గవితిక్కనయు, ఖడ్గతిక్కనయు, మంత్రులుగా నుండి విఖ్యాతిఁగాంచిరి. కొట్టరువు తిక్కనామాత్యకవి మనుమసిద్ధియొద్ద వహించినమంత్రిపదవి నిజకులక్రమా గతంబైనదని కేతన నుడివి

"గీ. అందలంబు గొడుగు లడపంబు మేల్కట్టు
    చామరములు జమిలిశంఖములును
    గంబగట్లు భూమి కానికగాఁగ బెం
    పెసఁగు రాచపదవు లెల్లఁ బడసె."

అని చెప్పుటవలన నతఁడు సనుస్త సంపత్సమేతుఁ డై రాజ్యసుఖంబు లనుభవించు చుండె ననుట యతిశయోక్తి గాదు.