పుట:Tikkana-Somayaji.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

తిక్కన సోమయాజి


విద్యాభ్యాసమునకు దొరకొనుటకు హేతు వేమి యైయుండునని కొందఱచ్చెరువు నొందవచ్చును. తిక్కనపూర్వులు తరతరముల నుండియు వైదికవిద్యలను వైదికానుష్ఠానములను విడిచిపెట్టక భక్తితో ననుష్ఠించుచు వచ్చిరి. అందువలనఁ దిక్కనతండ్రి యగుకొమ్మనామాత్యుడు పవిత్రశీలుఁడై సొంగోపాంగముగ వేదముల నభ్యసించెను. అయిన నతఁడు దండనాధుఁడుగ నుండుట కియ్యని యడ్డుపడలేదు. ఆకాలమునఁ దిక్కనయు, 'అవశ్యంపితురాచార'మ్మని తనతండ్రిమార్గమునే యధికశ్రద్ధాభక్తులతో ననుసరించి ధన్యుఁ డయ్యెనుగాని మఱియొండు గాదు. "ఉదాత్తవేదవిద్యా ప్రతిపాలకుఁడు, సకలవిద్యా కళాచణుఁడు, వేదత్రిత యాత్మకుఁడు, వేదాదిప్రకట వివిధ విద్యాభ్యాసాపాదిత మహత్త్వుఁడు, ఉదాత్తశ్రౌతస్మార్త కర్మతత్పరమతి, సకలాగమార్జతత్త్వవిచారోదారుఁడు, యాగ విద్యాభిరాముఁడు, వేదోదితకర్మవ్రతుఁడు, నానావేదవేదాంగ తత్త్వజ్ఞుఁడు, తతనయసువచస్సమగ్రతాచతురాస్యుఁడు, అని తరగమ్య వాఙ్మయ మహార్ణవవర్తన కర్ణధారుఁడు' అను విశేషణములతోఁ గేతనకవి తిక్కన నభివర్ణించి యుండుట చేతను, మఱియు నింక నిట్టివే యనేక కారణములచేతను సాంగోపాంగముగ వేదముల నభ్యసించి తిక్కన సమకాలమువారిచే వాక్పతినిభుఁ డనికొనియాడఁ బడు చుండె నని మనము నిస్సంశయముగా విశ్వసింప వచ్చును. దీనిని బట్టి తిక్కన , పినాకినీ