Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ యధ్యాయము.

తిక్కన జన్మాదికము.

తిక్కనజన్మస్థానముగాని, జన్మసంవత్సరముగాని మనకుఁ దెలియరాదు. తిక్కన కొమ్మనామాత్యునకు సదాచారసంపన్నయు, సుగుణశీలయు, మహాపతివ్రతయు నైన అన్నమాంబగర్భమున ఒకశుభముహూర్తమున జనించెను. ఇట్టి సుపుత్రుఁడు తమకు జనించినందులకుఁ బరమానందమును బొందుచు, దల్లిదండ్రులు జాతకర్మప్రముఖ సంస్కారంబులు యథావిధిగా నెఱవేర్చి తిక్కన యని శ్రీకాళహస్తిదేవుని తెనుఁగుపేరు పెట్టిరి. తిక్కనసోమయాజితండ్రియును, దాతయును గుంటూరివిభులుగా నున్నట్లు నిర్వచనోత్తర రామాయణా వతారికయును, ఆంధ్రమహాభారతము లోనివిరాటపర్వావతారికయును దెలుపుచున్నందునఁ దిక్కన జన్మస్థానము గుంటూరై యుండు నని యూహించుట కెక్కువ హక్కుగలదు గాని గుంటూరే జన్మస్థాన మనినిర్దేశించుటకు బలవత్తర మగురుజు నంతకంటె నధికము గానరాదు. ఆకాలమునఁ దల్లిదండ్రులు దమకొమాళ్ళకుఁ దిక్కన యనినామకరణముఁ జేయుట కాళహస్తిసమీపమండలవాసులలోఁ గానంబడునుగాని, గుంటూరు